South Delhi: దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలు బంద్.. అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం!

  • దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం
  • నవరాత్రుల సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు
  • మాంసం అపవిత్రమైనది కాదన్న ఒవైసీ
Owaisi fires on meat shops bandh in South Delhi

నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ దుమారం చెలరేగింది. నవరాత్రులను పురస్కరించుకుని ఈనెల 4 నుంచి నుంచి 11వ తేదీ వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్టు దక్షిణ ఢిల్లీ మేయర్, బీజేపీ నేత ముఖేశ్ సూర్యన్ పేర్కొన్నారు. 

నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలోని 99 శాతం కుటుంబాలు వెల్లుల్లి, ఉల్లిపాయను కూడా వినియోగించరని... అందువల్ల మాంసం షాపులు మూసివేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. తమ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పెద్ద పారిశ్రామికవేత్తలకు వ్యాపారం చేయడంలో సౌలభ్యం కలిగేలా, తన అనుచరులకు మతోన్మాదంలో సౌలభ్యం కలిగేలా ప్రధాని మోదీ చేస్తారని మండిపడ్డారు. మాంసం దుకాణాలను మూసి వేయడం వల్ల వారికి కలిగే ఆదాయ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. 

మాంసం అపవిత్రమైనది కాదని... వెల్లుల్లి, ఉల్లిపాయ మాదిరే అది కూడా ఒక ఆహారమని అన్నారు. 99 శాతం మందికి మాత్రమే కాదు 100 శాతం మందికి కూడా వారికి వద్దనుకుంటే మాంసం కొనకుండా ఉండే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. మాంసం దుకాణాలను తెరవాలని డిమాండ్ చేశారు.

More Telugu News