Imran Khan: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు... పంతం నెగ్గించుకున్న ఇమ్రాన్ ఖాన్

  • అవిశ్వాస తీర్మానం రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్
  • ఇమ్రాన్ ఖాన్ కు తొలగిన పదవీగండం
  • జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫారసు
  • ఇమ్రాన్ సిఫారసుకు దేశాధ్యక్షుడి ఆమోదం
  • పాక్ లో మళ్లీ ఎన్నికలు
  • సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు
Pakistan President dissolves national assembly

పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని అందరూ భావించారు. అయితే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆఖరి నిమిషంలో చక్రం అడ్డేసి ఇమ్రాన్ ఖాన్ ను కాపాడారు. అక్కడ్నించి తన రాజకీయ వ్యూహ చతురతను ప్రదర్శించిన ఇమ్రాన్ ఖాన్... జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ సిఫారసు చేశారు. ప్రధాని సిఫారసుకు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం తెలిపారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. 

అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకుండానే అసెంబ్లీని రద్దు చేయించడం ద్వారా ఇమ్రాన్ తన పంతం నెగ్గించుకున్నారు. తద్వారా, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న తన ఆలోచనలకు కార్యారూపం ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తాజాగా ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్ భవితను, తమను ఎవరు పరిపాలిస్తారన్న అంశాన్ని ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కాగా, జాతీయ అసెంబ్లీ రద్దుతో రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్టేనని భావిస్తున్నారు. 

అయితే ఈ వ్యవహారాన్ని పాక్ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపకపోవడాన్ని ప్రశ్నిస్తూ విపక్షాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

More Telugu News