Madras High Court: కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా కాదు.. జైలు శిక్షే కరెక్ట్: మద్రాస్ హైకోర్టు

  • అక్రమ నిర్మాణాలు గుర్తించి కూడా చర్యలు తీసుకోని అధికారి
  • మూడేళ్లపాటు వేతన పెంపును నిలిపివేస్తూ చెన్నై కార్పొరేషన్ ఉత్తర్వులు
  • హైకోర్టును ఆశ్రయించిన అధికారి
  • అప్పీలుకు వెళ్లిన కార్పొరేషన్
Jail officials who allow violations of building laws Madras HC

అక్రమ నిర్మాణాలను గుర్తించి కూడా చర్యలు తీసుకోని అధికారికి చెన్నై కార్పొరేషన్ మూడేళ్లపాటు వేతనపెంపును నిలిపివేస్తే ఆయనేమో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ఉత్తర్వులను లెక్కచేయని అధికారులకు జరిమానాలు సరిపోవని, వాటి కంటే జైలు శిక్ష విధించడమే సరైనదని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. చెన్నైలో నిబంధనలు అతిక్రమించి కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చెన్నై కార్పొరేషన్ అధికారి దైవశిఖామణి ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో తీవ్రంగా స్పందించిన కార్పొరేషన్ మూడేళ్లపాటు ఆయనకు వేతనం పెంచకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన హైకోర్టులో సవాలు చేశారు. దీంతో కార్పొరేషన్ అప్పీలుకు వెళ్లింది. గతేడాది అక్టోబరులో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పదోన్నతి జాబితాలో దైవశిఖామణి పేరును పరిశీలించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

శుక్రవారం మరోమారు దీనిపై విచారణ జరగ్గా.. స్టే ఉత్తర్వులు ఇస్తే తప్పించి, అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు తమ నిర్ణయాలను వెంటనే వెల్లడించాలని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా విధించడం కంటే జైలు శిక్షే సరైనదని పేర్కొంది. వారిని సస్పెండ్ చేయాలని, ఆ తర్వాత కూడా వారిని ప్రాధాన్యం లేని పోస్టులో నియమించాలని పేర్కొంది.

చర్యలు తీసుకోవాల్సిన అధికారులు భవన యజమానుల నుంచి లంచాలు తీసుకోవడం సిగ్గు పడాల్సిన విషయమని పేర్కొంది. ఇలాంటి అధికారుల అసమాన సంపదపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విభాగం సేవలను ఉపయోగించుకోవాలని కోరింది. తదుపరి విచారణను నాలుగో తేదీకి వాయిదా వేసింది.

More Telugu News