LV Subramanyam: వ్యవస్థను గౌరవించకపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • ఏపీలో సీఎస్ ను సీఎం ఎంపిక చేస్తున్నారు
  • సీఎంకు సోమవారం నచ్చిన సీఎస్.. శుక్రవారానికి నచ్చకపోవచ్చు
  • పరిధి దాటి వ్యవహరించిన ఒక ఐఏఎస్ కు షోకాజ్ నోటీసిచ్చాను
  • ఐఏఎస్ లు పరిధి దాటకుండా 2019లోనే జగన్ సరైన నిర్ణయం తీసుకోవాల్సింది
  • అదే జరిగుంటే ఇప్పుడు 8 మంది ఐఏఎస్ లకు శిక్ష పడేది కాదు
 Former Chief Secretary LV Subramanyam Sensational Comments on Jagan Govt

జగన్ ప్రభుత్వంపై మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ... ఏపీలో చీఫ్ సెక్రటరీని సీఎం ఎంపిక చేస్తున్నారని... కర్ణాటకలో కేబినెట్ ఎంపిక చేస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో... సోమవారం నాడు ముఖ్యమంత్రికి ఒక సీఎస్ నచ్చొచ్చని, శుక్రవారం కల్లా ఆయన మీద మోజు తీరిపోవచ్చని అన్నారు. ఆయన మొహం నచ్చకపోవచ్చు, ఆయన ఆలోచనలు నచ్చకపోవచ్చని... కానీ ప్రశ్నించే అధికారం మాత్రం ఎవరికీ లేదని అన్నారు. 

ఈ విషయంపై కొందరు హైకోర్టులో పిల్ వేశారని... అయితే ఇది పిల్ కిందకు రాదని హైకోర్టు చెప్పిందని తెలిపారు. సీఎస్ వ్యక్తిగతంగా ఫైల్ చేసుకుంటే తాము వింటామని ఆరోజుల్లో తీర్పిచ్చిందని చెప్పారు. సీఎస్ ఎవరుంటే ఏమి? అని సమాజం అనుకుంటే.. కత్తి లేకుండా యుద్ధం చేసినట్టేనని అన్నారు. 

తాను సీఎస్ గా ఉన్నప్పుడు... మీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పండి... సీఎస్ గా వారికి తాను ఆదేశాలు ఇస్తానని జగన్ కు చెప్పానని... అయితే, అలాంటి ఆలోచన ఏమీ లేదని, మీరే సీఎస్ గా ఉంటారని ఆయన చెప్పారని ఎల్వీ తెలిపారు. ఇంకో సంవత్సరం మీరే సీఎస్ గా ఉంటారని ఆయన చెప్పారని అన్నారు.

 ఆయన అలా చెప్పిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, మచ్చ పడకుండా, అంతా సక్రమంగా జరిగేలా చూడాలని తాను అనుకున్నానని చెప్పారు. అయితే, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా, దీనికి విఘాతం కలిగిస్తున్న అధికారులను పిలిచి మూడు సార్లు హెచ్చరించానని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని చెప్పానని, అయితే ఒక అధికారి మాత్రం గ్రహించే పరిస్థితిలో లేకపోయాడని తెలిపారు. దీంతో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సదరు అధికారికి తాను షోకాజ్ నోటీస్ ఇచ్చానని చెప్పారు. 

అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తే ఏమవుతుందనే విషయం ఇప్పుడు 2022లో మనకు గోచరమవుతోందని అన్నారు. ఇలా జరగకూడదు అని 2019లోనే సీఎం జగన్ నిర్ణయం చేసి ఉంటే... 2022లో ఎనిమిది మంది ఐఏఎస్ లకు కోర్టు ధిక్కరణ కింద శిక్షపడేది కాదని చెప్పారు. శిక్ష పడిన ఐఏఎస్ లు దుఃఖితులై, మీడియాలో, పత్రికల్లో ఫొటోలు పడి అవమానాలకు గురికావాల్సిన పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. వ్యవస్థను గౌరవించకపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More Telugu News