Lucknow Super Giants: భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన చెన్నై.. వరసగా రెండో పరాజయం

  • 211 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన లక్నో
  • బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఎవిన్ లూయిస్
  • రాణించిన రాహుల్, డికాక్
Lewis and De Kock fifties power LSG to maiden IPL win

బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్‌లో మరో ఓటమి ఎదురైంది. గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఉతప్ప (50), శివమ్ దూబే (49) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ప్రత్యర్థి లక్నోకు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో పరుగుల వరద పారించింది. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేయగా, డికాక్ 45 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఇక, లూయిస్ అయితే  బౌలర్లకు చుక్కలే చూపించాడు. బంతిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. 

23 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు పిండుకుని అజేయంగా నిలిచాడు. ఆయుష్ బడోని మరోమారు మెరిశాడు. 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేయడంతో లక్నో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో డ్వైన్ ప్రిటోరియస్ రెండు వికెట్లు తీసుకోగా, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 28 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (1) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మొయిన్ అలీ క్రీజులోకి రావడంతో ఆట స్వరూపం మారిపోయింది. అతడికి అండగా ఓపెనర్ ఊతప్ప చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేశాడు. మొయిన్ కూడా ధాటిగా ఆడి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

మిడిలార్డర్‌లో యువ ఆటగాడు శివమ్ దూబే 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. రాయుడు 27, కెప్టెన్ జడేజా 17, ధోనీ 16 పరుగులు నమోదు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి జట్టుకు అలవోక విజయాన్ని అందించిన లక్నో ఆటగాడు లూయిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్ 8వ మ్యాచ్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి.

More Telugu News