Ravi Shastri: ఆ షాట్ ను కోహ్లీ ఎక్కువగా ఆడడు... ఇప్పుడు బయటికి తీశాడు: రవిశాస్త్రి

  • ఐపీఎల్ లో స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటున్న కోహ్లీ
  • ఫుట్ వర్క్ తో రాణిస్తున్న వైనం
  • స్వీప్ షాట్లు తరచుగా ఆడుతున్న మాజీ కెప్టెన్
  • ప్రాక్టీసులోనూ ఈ షాట్ ఎక్కువగా ఆడాలన్న శాస్త్రి
Ravi Shastri opines on Virat Kohli sweep shots in IPL

ఇటీవల కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును పరిశీలిస్తే స్పిన్నర్ల బౌలింగ్ లో ఎక్కువగా అవుట్ కావడం గమనించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన కోహ్లీ స్థాయి బ్యాట్స్ మన్ ఈ దశలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడడం క్రికెట్ పండితులను ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న కోహ్లీ ఆ లోపాన్ని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

దీనిపై టీమిండియా మాజీ కోచ్, కోహ్లీ శ్రేయోభిలాషి రవిశాస్త్రి స్పందించారు. కోహ్లీలో తాను ఎక్కువగా ఇష్టపడే గుణం పోరాట పటిమ అని వెల్లడించారు. ప్రత్యర్థికి లొంగడాన్ని కోహ్లీ ఏమాత్రం ఇష్టపడడని తెలిపారు. ఐపీఎల్ లో స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో కోహ్లీ ఫుట్ వర్క్ పై శ్రద్ధ పెట్టాడని, దాని ఫలితమే పంజాబ్ కింగ్స్ తో పోరులో పలుమార్లు స్వీప్ షాట్లు ఆడాడని వివరించారు. 

నాణ్యమైన స్పిన్ ను ఎదుర్కోవడంలో స్వీప్ షాట్ ఎంతో ప్రధానమైనదని, అయితే, కోహ్లీ ఈ షాట్ ను ఎక్కువగా ఆడడని రవిశాస్త్రి వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్ లో స్వీప్ షాట్ ను అధికంగా ఆడుతుండడం అభినందనీయం అని పేర్కొన్నారు. కోహ్లీ ఇకముందు కూడా స్వీప్ షాట్లను ఆడడంపై అధికంగా దృష్టి సారించాలని సూచించారు. నెట్స్ లో పేస్ బౌలింగ్ కంటే స్పిన్ ను ఆడడంపై ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని సలహా ఇచ్చారు. స్వీప్ షాట్లు ఆడడం ద్వారా ప్రత్యర్థి స్పిన్నర్ లయను దెబ్బతీయొచ్చని, తద్వారా బ్యాట్స్ మన్ కు ఏ బంతి వేయాలో తెలియక స్పిన్నర్ అయోమయానికి గురవుతాడని వివరించారు. 

ఇటీవల అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ... తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లీ మునుపటి కంటే ఎంతో ప్రమాదకారిగా మారతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News