Harish Rao: తెలంగాణపై దొంగ ప్రేమ ఆపండి రాహుల్ గాంధీ గారూ!: హరీశ్ రావు

  • ధాన్యం కొనుగోలు అంశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు  
  • బీజేపీ, టీఆర్ఎస్ నైతిక బాధ్యత విస్మరించాయన్న రాహుల్
  • రైతుల శ్రమతో రాజకీయం సిగ్గుచేటని వ్యాఖ్యలు
  • మొసలి కన్నీరు అంటూ హరీశ్ రావు స్పందన
Harish Rao fires on Rahul Gandhi over paddy procurement issue

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం... మున్ముందు పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ అదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ధాన్యం కొనుగోలు అంశంపై స్పందించారు. 

తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని స్పష్టం చేశారు. 

దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి అంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంటులో మా ఎంపీలతో కలిసి మీరు ఆందోళన చేయండి... రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి అంటూ హరీశ్ రావు హితవు పలికారు.

More Telugu News