YS Jagan: తెలంగాణ హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్‌.. ఊరట

  • ప్ర‌జా ప్రతినిధుల కోర్టులో జ‌గ‌న్‌పై కోడ్ ఉల్లంఘ‌న కేసు
  • ఇప్ప‌టికే స‌మ‌న్లు జారీ అయిన వైనం
  • హైకోర్టులో జ‌గ‌న్ క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు
  • ఏప్రిల్ 26 దాకా ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌రు కాకుండా హైకోర్టు వెసులుబాటు
ap cm jagan aproaches telanagana high court

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టులో కొన‌సాగుతున్న హుజూర్ న‌గ‌ర్ ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసును కొట్టేయాల‌ని ఆయ‌న హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా హుజూర్ న‌గ‌ర్‌లో ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తూ జ‌గ‌న్ రోడ్ షో నిర్వహించారంటూ ఫిర్యాదు అందుకున్న అధికారులు జ‌గ‌న్‌పై ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విచార‌ణ ప్ర‌స్తుతం నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టులో సాగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసును రెండు ప‌ర్యాయాలు విచారించిన సదరు కోర్టు విచార‌ణ‌కు హాజరుకావాలంటూ ఇటీవలే జగన్ కు స‌మ‌న్లు జారీచేసింది. అయితే జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌న్లు అంద‌క‌పోవ‌డంతో ఆయ‌నకు కాస్తంత ఊర‌ట ల‌భించింద‌నే చెప్పాలి.

సోమ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా ఈ నెల 31లోగా జ‌గ‌న్‌కు స‌మ‌న్లు అందేలా చూడాలంటూ ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు ఆదేశాలు జారీచేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌గ‌న్ ముందుగానే తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ట్లుగా స‌మాచారం. జ‌గ‌న్ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన తెలంగాణ హైకోర్టు.. ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు విచార‌ణ‌కు ఏప్రిల్ 26 దాకా హాజ‌రు కాకుండా ఉండేలా జ‌గ‌న్‌కు వెసులుబాటు క‌ల్పించింది.

More Telugu News