Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేడు రాజీనామా.. రేపు అరెస్ట్ అయ్యే అవకాశాలు!

  • పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్ ఖాన్
  • నేటి  ఇస్లామాబాద్‌లో ర్యాలీలో రాజీనామా ప్రకటన!
  • ఇమ్రాన్ పాార్టీకి పెద్ద ఎత్తున విదేశీ నిధులు అందాయన్న ఎన్నికల సంఘం
  • రేపు ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం
  • జాడలేకుండా పోయిన 50 మంది మంత్రులు
pakistan prime minister imran khan to resign today

చూస్తుంటే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శకం ముగిసినట్టే ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఇమ్రాన్ వాటి నుంచి బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు అవిశ్వాస తీర్మానం, ఇంకోవైపు ఆర్మీ నుంచి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న ఇమ్రాన్ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. నేడు ఇస్లామాబాద్‌లో నిర్వహించనున్న భారీ ర్యాలీలో బహుశా ఆయనీ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ఇమ్రాన్ ఖాన్ పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కి 7.32 లక్షల అమెరికా డాలర్ల విదేశీ నిధులు అందాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) పేర్కొంది. ఇప్పుడీ ప్రకటన ఇమ్రాన్ కొంప ముంచింది. మొత్తం 349 విదేశీ కంపెనీలు, 88 మంది వ్యక్తుల నుంచి ఈ నిధులు అందినట్టు ఈసీపీ పేర్కొంది. రేపు (సోమవారం) పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ నేపథ్యంలో నిషేధిత విదేశీ నిధుల సేకరణ అభియోగాలపై ఇమ్రాన్‌ను రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు పాక్ మీడియాలో గుప్పుమన్నాయి.


మరోవైపు, ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఇమ్రాన్  ఖాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు పాక్ మీడియా పేర్కొంది. ఈ వార్తలను బలపరిచేలా ఆయన తన యూట్యూబ్ చానల్ పేరును ప్రధానమంత్రి కార్యాలయం (పీఎవో)ను ఇమ్రాన్‌ఖాన్‌గా మార్చారు. కాగా, బుధవారం మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. అయితే, ప్రతిపక్షాలు విస్తుపోయే ప్రకటన మాత్రం ఉంటుందని చెప్పారు. ఆ ప్రకటన మరేదో కాదని, రాజీనామానే అయి ఉంటుందని చెబుతున్నారు. కాగా, రేపు అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో ఇమ్రాన్ కేబినెట్‌లోని 50 మంది మంత్రులు జాడలేకపోవడం చర్చనీయాంశమైంది.

More Telugu News