Cricket: ఐపీఎల్ ఆరంభానికి ముందు.. తండ్రిని, కోచ్ ని గుర్తుచేసుకుని పంత్ భావోద్వేగం

  • ఇద్దరినీ పోగొట్టుకున్న రిషభ్ పంత్
  • ఆటలో ఉండగానే వారు చనిపోయారంటూ ఆవేదన
  • వాళ్లు లేని లోటు ఎవరూ పూరించలేరన్న ఢిల్లీ కెప్టెన్
Rishabh Pant Goes Emotional Remembering Father and His Coach

రిషభ్ పంత్.. వికెట్ కీపర్ గా, భవిష్యత్ కెప్టెన్ గా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించి.. ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. అయితే, తాజా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అతడు తన తండ్రి రాజేంద్ర, కోచ్ తారక్ సిన్హాను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్ కు ప్రాణం పోసిన ఇద్దరూ చనిపోవడంతో అతడు తీవ్ర ఆవేదన చెందాడు. 

2017లో ఐపీఎల్ ఆడుతుండగా.. పంత్ తండ్రి రాజేంద్ర నిద్రలోనే కన్నుమూశారు. దీంతో ఐపీఎల్ ను వదిలేసిన పంత్ తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ సమయంలో పంత్ కోచ్ తారక్ కూడా చనిపోయారు. లంగ్ కేన్సర్ తో పోరాడి ప్రాణాలు వదిలారు. 

ఆ రెండు ఘటనలను పంత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తాను ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నానంటే దానికి కారణం తన తండ్రి, కోచ్ లే కారణమని చెప్పాడు. తన తండ్రి లేని లోటు తెలుస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 

‘‘సీజన్ అయిపోగానే వెళ్లి మా నాన్నను కలుద్దామనుకున్నా. కానీ.. అతడిని నేను మిస్ అయిపోయా. చాలా మిస్ అవుతున్నా. మా నాన్న చనిపోయినప్పుడు నేను మ్యాచ్ ఆడుతున్నా. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారైన కోచ్ తారక్ చనిపోయినప్పుడూ ఆటలోనే బిజీగా ఉన్నా. వాళ్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. తారక్ సార్ కు అవసరమొచ్చినప్పుడల్లా అండగా ఉన్నా’’ అని చెప్పాడు. 

జీవితంలో ఏం జరిగినా.. క్రికెట్ ఆడుతూనే ఉండాలని, కుటుంబాన్ని కాపాడుకోవాలని తారక్ సార్ చెప్పాడంటూ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తనకు ఏ కష్టమొచ్చినా తన తల్లి, తన కోచ్ స్టూడెంట్ అయిన దేవేంద్ర శర్మకు చెప్పుకుంటున్నానని పేర్కొన్నాడు. ఎవరున్నా తన తండ్రి, కోచ్ లేని లోటును భర్తీ చేయలేరన్నాడు. 

తన సర్కిల్ చాలా చిన్నదని, ఫ్యామిలీ, స్నేహితులకంటూ తన మనసులో ఓ చోటు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, టీమిండియా వైస్ కెప్టెన్సీపైనా పంత్ స్పందించాడు. టీమిండియా వైస్ కెప్టెన్ గా రెండు మ్యాచ్ లకు అవకాశం వచ్చిందని, ఏ బాధ్యతలున్నా తన ఆట కోసం 200 శాతం ఇవ్వడమే తనకున్న ఏకైక లక్ష్యమని వివరించాడు. ఫీల్డింగ్ లో అప్పుడప్పుడు రోహిత్ భాయ్ కి కూడా సలహాలిస్తుంటానని, బౌలర్ లకు అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

More Telugu News