Storms: హిందూ మహాసముద్రంలో మారిన పరిస్థితులు.. మున్ముందు మరింత తీవ్రంగా తుపాన్లు!

  • హెచ్చరిస్తున్న పర్యావరణ శాస్త్రవేత్తలు
  • మునుపటి కన్నా వేగంగా వేడెక్కుతున్న సముద్రం 
  • తుపాన్ల పుట్టుకపై పెను ప్రభావం
  • పుట్టిన కొద్ది వ్యవధిలోనే తీవ్రం
  • ఎక్కువ కాలం పాటు మనుగడ
Temperatures Rising In Indian Ocean To intensifies storms further more severe

నాలుగేళ్ల క్రితం 2017 నవంబర్ 28న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. చాలా వేగంగా తీవ్ర వాయుగుండంగా.. ఆ వెంటనే భారీ తుపానుగా రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్ లను అతలాకుతలం చేసేసింది. సాధారణంగా సముద్రంలో ఓ తుపాను జీవితకాలం 4.7 రోజులే. కానీ, ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఆ 'ఓఖీ' తుపాను 6.7 రోజులుంది.

2020లో ఏర్పడిన అంఫన్ తుపాను జస్ట్ 18 గంటల్లోనే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5కి పెరిగిపోయింది. గత ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను.. ఏకంగా 11 రోజుల పాటు సూపర్ సివియర్ సైక్లోన్ గా ఉండిపోయింది. 

...ఇవన్నీ జస్ట్ కొన్ని ఉదాహరణలే. మున్ముందు ఇలాంటి తీవ్రమైన తుపాన్లు సర్వసాధారణమైపోతాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) శాస్త్రవేత్తలు, ఇతర పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కారణం, సముద్రాలు వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులేనని తేల్చి చెబుతున్నారు. 

ఈ క్రమంలోనే తుపాన్లను ముందే గుర్తించి.. వాటి తీవ్రతను ముందే తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఓషన్ అట్మాస్ఫెరిక్ నమూనాలను వాడుకుని తుపాన్ల తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే తుపాన్ల పుట్టుక, అవి తయారవడానికి ముందున్న పరిస్థితులు, అల్పపీడనం, వాటి తీవ్రతలను ముందే తెలుసుకునే వ్యవస్థను ఐఎండీ ఏర్పాటు చేసింది. అసానీ తుపాను నేపథ్యంలో ముందస్తుగానే వివరాలను వెల్లడించింది. ఈ వ్యవస్థను ప్రపంచంలోనే తొలిసారిగా ఐఎండీ వాడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ప్రజలకు తుపాన్ల గురించి ముందే హెచ్చరించి భారీ నష్టం నుంచి తప్పించేందుకు వీలుంటుందని అంటున్నారు. 

అయితే, ఎన్ని సాంకేతికలున్నా.. పర్యావరణ మార్పుల వల్ల సముద్రాల్లో తుపాన్ల పుట్టుకలో తేడాలు వచ్చేస్తున్నాయని, తద్వారా తుపాను సన్నద్ధత, దాని ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలను చేపట్టడం వంటి విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఇప్పటికే అలాంటి చాలా ఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. 

ఆ తుపాన్లన్నీ కూడా ఒకదానికొకటి భిన్నమైనదని, తీవ్రతలోనూ తేడాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అత్యంత సవాళ్లను విసిరాయని, భవిష్యత్ లో అలాంటి తుపాన్లు మరిన్ని వస్తాయని, అవి విసిరే సవాళ్లు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

హిందూ మహాసముద్రంలోని ఉత్తర ప్రాంతం చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. దాని వల్ల కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా తుపాన్లపై పెను ప్రభావం పడుతోందని, ఆరంభంలోనే తుపాన్లు తీవ్రమవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వచ్చే తుపాన్ల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. 

‘‘అతి తక్కువ వ్యవధిలోనే తుపాన్లు ఏర్పడి.. తీవ్రమైపోతున్నాయి. ఏర్పడిన తుపాన్ల మనుగడ కూడా ఎక్కువ కాలం ఉంటోంది. సముద్రంలో తుపాను ఎన్ని ఎక్కువ రోజులుంటే అంత ఎక్కువ శక్తిని అది తీసుకుంటుంది. దీంతో తీవ్రత అతి త్వరగా పెరుగుతుంది’’ అని పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్ మెంట్ (ఐఐటీఎం) క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. 

ఇకపై వచ్చే తుపాన్లు కేవలం తుపాన్లలా మాత్రమే ఉండవని, వాటితో పాటు మరిన్ని తీవ్రమైన పరిణామాలను మోసుకొస్తాయని ఆయన హెచ్చరించారు. అత్యధిక వర్షపాతం, పెను వరదలు పెరిగిపోతాయని చెప్పారు. 

తుపాను ఏర్పాటులో సముద్రపు ఉష్ణోగ్రతలే కీలకమని, వాటిని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన ట్రాపికల్ సైక్లోన్ హీట్ పొటెన్షియల్ (టీహెచ్ సీపీ)  వ్యవస్థలు ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోయే దాఖలాలు లేవని అంటున్నారు. కాబట్టి మున్ముందు వచ్చే తీవ్రమైన తుపాన్లను సమర్థంగా గుర్తించాలంటే మరింత సమర్థవంతమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. పరిశోధనా వ్యవస్థలను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

More Telugu News