Telugu Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రాబోతున్న చిత్రాలు ఇవే!

  • మార్చి 25న విడుదలవుతున్న 'ఆర్ఆర్ఆర్'
  • మార్చి 25 నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 'భీమ్లా నాయక్'
  • మార్చి 25న జీ5లో విడుదలవుతున్న 'వలిమై'
Telugu movies releasing this week in theatres and OTTs

ఈ వారం సినిమా థియేటర్లు, ఓటీటీలు మోత మోగనున్నాయి. భారీ చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ వారమే విడుదలవుతోంది. దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. 

ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు:

ఆర్ఆర్ఆర్: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:

భీమ్లా నాయక్: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలయింది. త్రివిక్రమ్ సంభాషణలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 25 నుంచి ఈ చిత్రం ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో విడుదల కాబోతోంది. 

వలిమై: తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన 'వలిమై' ఫిబ్రవరి 24న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తికేయ నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం మార్చి 25న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News