Odisha: ఐపీఎస్ అధికారి బ్యాగ్‌ను ఓపెన్ చేయమన్న ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది.. అందులో ఉన్నవి చూసి అందరూ షాక్!

  • ఒడిశాలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న అరుణ్ బోత్రా
  • కిలో రూ. 40కే పచ్చి బఠానీల కొనుగోలు
  • జైపూర్‌లో కొని, విమానంలో ఇంటికి తీసుకెళ్తున్న వైనం
  • అనుమానంగా కనిపించడంతో తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది
Airport Security Asked IPS Officer To Open Bag green peas inside the bags

సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కామెంట్లతో హోరెత్తుతోంది. అరుణ్ బోత్రా ఒడిశా ట్రాన్స్‌పోర్టు కమిషనర్. పచ్చి బఠానీలతో నిండిన బ్యాగుల ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఈ బఠానీల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఇటీవల ఓ పని నిమిత్తం జైపూర్ వెళ్లిన అరుణ్.. పూర్తి కాగానే ఒడిశాకు తిరుగు పయనమయ్యారు. రెండు పెద్ద హ్యాండ్ బ్యాగులతో జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 

ఆ బ్యాగులను స్కానింగ్ చేసిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది బ్యాగుల్లో అనుమానాస్పద వస్తువులు ఏవో ఉన్నట్టు గమనించారు. వెంటనే వాటిని తెరవాలని కోరారు. అరుణ్ వాటిని తెరిచాక.. అందులో పచ్చి బఠానీలను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. జైపూర్‌లో కిలో రూ. 40కే విక్రయిస్తుండడంతో చవగ్గా వస్తున్నాయని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నట్టు చెప్పగానే భద్రతా సిబ్బందితో పాటు అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత అవే ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జైపూర్ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది నా బ్యాగులను తెరవమన్నారంటూ బ్యాగుల నిండా ఉన్న పచ్చి బఠానీల ఫొటోలను షేర్ చేశారు. 

ఆ వెంటనే అది వైరల్ అయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. అరుణ్ బోత్రా ట్వీట్ చూసి ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ కూడా తన అనుభవాలను పంచుకున్నారు. తానోసారి కూరగాయలు పట్టుకెళ్తుంటే కూడా విమానాశ్రయంలో ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు. పచ్చి బఠానీలను స్మగ్లింగ్ చేయడంపై కేసు ఏదీ నమోదు కాలేదు కదా అని ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ సరదాగా కామెంట్ చేశారు. జైపూర్‌లో తాను కూడా కిలో రూ. 40కే పచ్చి బఠానీలను కొన్నానని, బోత్రా కూడా అదే ధరకు కొన్నారని మరో యూజర్ చమత్కరించాడు.

More Telugu News