Tamil Nadu: తమిళనాడులో కొత్త ప్రయోగం.. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ‘రైట్ టు హెల్త్’!

  • ప్రజలకు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య, వైద్య సేవలు
  • బిల్లు తీసుకొచ్చేందుకు సర్కారు కసరత్తు
  • నిపుణులతో ముఖ్యమంత్రి స్టాలిన్ చర్చలు
Tamil Nadu govt drafting Right to Health Bill

ఆరోగ్య హక్కును ప్రజలకు ఇచ్చే దిశగా స్టాలిన్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైట్ టు హెల్త్ బిల్లును రూపొందిస్తోంది. అందరికీ సార్వత్రిక హెల్త్ కవరేజీని ఆఫర్ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ , ప్రజారోగ్యం నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం గత వారం ఒక సమావేశం కూడా నిర్వహించారు. 

అన్ని వయసుల వారు, అనారోగ్య సమస్యలున్నవారు, మానసిక వైకల్య బాధితులకూ ఈ బిల్లు కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నారు. ఇవి చిన్న అడుగులే అయినా, ఈ విషయంలో తమిళనాడు ముందుంటుందని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ తెలిపారు. ఈ బిల్లు ప్రజలు అందరి ఆకాంక్షలకు తగ్గట్టు ఉంటుందన్నారు. ఈ బిల్లు వస్తే ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడం కుదరదని అధికారులు చెబుతున్నారు.

ఈ బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల నాటికి తీసుకువచ్చే అవకాశాలున్నాయని అధికారుల్లో ఒక వర్గం భావిస్తోంది. అయితే బిల్లు అమలు అంత సులభం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ‘‘రైట్ టు హెల్త్ 79 దేశాల్లో ఉంది. ఆయా దేశాల్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి. అరుదైన వ్యాధుల విషయంలో ఎలా వ్యవహరించాలి? రైటు టు హెల్త్ అమలుకు సిబ్బంది అవసరం ఏ మేరకు అవసరం? అన్నవి చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. 

1990 నుంచి థాయిలాండ్ లో ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కేర్ అందిస్తుండగా, అటువంటి నమూనాను తమిళనాడులోనూ అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ హక్కు అమలుకు ముందుగా తగినన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News