Prabhas: ఖరీదైన ప్రేమకథగా కనిపించే.. 'రాధేశ్యామ్' (రివ్యూ)!

  • ఈ రోజే విడుదలైన రాధే శ్యామ్ 
  • ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే
  • ప్రేమకీ .. విధికి మధ్య జరిగిన పోరాటం 
  • విజువల్ బ్యూటీగా తీర్చిదిద్దిన దర్శకుడు 
  • పలచబడిన కథలో బలహీనమైన పాత్రలు 
  • హైలైట్ గా నిలిచిన ఫొటోగ్రఫీ  
Radhe Shyam movie review

ప్రభాస్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ వస్తుందంటే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. 'బాహుబలి' .. 'బాహుబలి 2' వంటి సినిమాల్లో యుద్ధాలు చేసిన ప్రభాస్, 'సాహో'లో భారీ యాక్షన్ ఎలా ఉంటుందో చూపించిన ప్రభాస్ ఒక్కసారిగా రొమాంటిక్ లవ్ స్టోరీ జోనర్లోకి వెళ్లడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. 

నిర్మాణ సంస్థలు ఈ సినిమా కోసం కోట్ల రూపాయలను కుమ్మరించడం మరింతగా అంచనాలను పెంచుతూ వెళ్లింది. వివిధ భాషల్లో ఈ రోజునే థియేటర్లలో దిగిపోయిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందన్నది ఇప్పుడు చూద్దాం. 

1970లలో ఈ కథ మొదలవుతుంది. విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులున్న హస్తసాముద్రికుడు. ఆయన గురువు పరమహంస (కృష్ణంరాజు). హస్తసాముద్రికంలో విక్రమాదిత్య గురువును మించిన శిష్యుడు అనేది పరమహంస అభిప్రాయం. గ్రహాలకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకోవడానికి కొంతమంది సైంటిస్టులు పరమహంసను కలుసుకోవడానికి ఇండియాలోని ఆయన ఆశ్రమానికి వస్తారు. అక్కడ జరిగిన సంభాషణలో విక్రమాదిత్య పేరు ప్రస్తావనకి రావడంతో, కథ ఇటలీకి షిఫ్ట్ అవుతుంది. 

తన తల్లి (భాగ్యశ్రీ) నృత్య ప్రదర్శన కోసం ఇటలీ వచ్చిన విక్రమాదిత్యకి ప్రేరణ (పూజ హెగ్డే) తారసపడటంతో ఆయన మనసులో అలజడి మొదలవుతుంది. ప్రేరణ ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్ ఆమె పెదనాన్న (సచిన్ ఖేడ్కర్) నిర్వహణలో నడుస్తుంటుంది. తన చేతిలో ప్రేమ రేఖలు లేకపోయినా ఆమెతో అలాంటి ఒక అనుభూతిని పొందాలని విక్రమాదిత్య కోరతాడు. తన చేతిలో రేఖలు చూసి తన భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది చెప్పమని కోరుతుంది ప్రేరణ. ఆమె నూరేళ్లు బ్రతుకుతుందని చెబుతాడు విక్రమాదిత్య. 

అదే సమయంలో ఆమె హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. విక్రమాదిత్య ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు. ప్రేరణ ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందనీ, రెండు మూడు నెలలకి మించి బ్రతకదని ఆమె పెదనాన్న ద్వారా తెలుసుకున్న విక్రమాదిత్య, తాను చెప్పిన జోస్యం ఇంతవరకూ తప్పుకాలేదనీ, ప్రేరణకి ఏమీ కాదని బలంగా చెబుతాడు. 

ఆయన మాటలతో జీవితం పట్ల ప్రేరణ ఆశలు పెట్టుకుంటుంది. అయితే విక్రమాదిత్య మాటల్లో నిజం లేదని నిరూపించడానికి ఆమె పెదనాన్న ఒక ప్లాన్ చేస్తాడు. అదేమిటి? తాను బ్రతుకుతాననే ఆశ చిగురించిన క్షణంలోనే విక్రమాదిత్య గురించి ఆమెకి తెలిసే చేదు నిజం ఏమిటి? చివరికి వాళ్ల ప్రేమ విధికి తలవంచుతుందా? విధిని ఎదిరించి నిలబడుతుందా? అనేదే కథ.

దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ కథను పట్టుగా చెప్పాడా .. గ్రాండ్ గా చెప్పాడా? అంటే, గ్రాండ్ గా చెప్పడానికే ప్రయత్నించాడని అనాలి. కథ ఇటలీలోని అందమైన లొకేషన్స్ లో అలా సాగిపోతూ ఉంటుంది .. ఎక్కడా కూడా ఆసక్తికరమైన .. అనూహ్యమైన మలుపులు కనిపించవు. ట్రాలీ షాట్ మాదిరిగా కథ హీరోహీరోయిన్ల చుట్టూనే తిరుగుతుందే తప్ప, మిగతా పాత్రలను గురించి ఎంతమాత్రం పట్టించుకోదు. భాగ్యశ్రీ .. జగపతిబాబు .. మురళీశర్మ .. జయరామ్ ఇలా ముఖ్యమైన పాత్రలు కొన్నే ఉన్నప్పటికీ వాటిని కూడా డమ్మీ చేసి వదిలిపెట్టారు. 

డీసెంట్ గా కనిపించే విక్రమాదిత్య హఠాత్తుగా రోడ్ల మీద పరుగులు పెట్టడం .. హాస్పిటల్ బెడ్ పై కామెడీ చేయడం చూస్తే ఆయన క్యారెక్టరైజేషన్ సరిగ్గా రాసుకోలేదనిపిస్తుంది. డెత్ ప్రాక్టీస్ సీన్లో పూజను చూసినా అలాగే అనిపిస్తుంది. భాగ్యశ్రీ వలన ఈ సినిమాకి ఏమీ కలిసి రాలేదనే చెప్పాలి. ఆమె గొప్ప డాన్సర్ అన్నారు .. మేకప్ రూమ్ వరకే చూపించారు.   

ఇక జయరామ్ ను షిప్ కి కెప్టెన్ గా ఎందుకు చూపించారో .. ఆయనను హాస్పిటల్లో ఎందుకు చేర్చుకున్నారో .. ప్రేరణను చూసి తన కళ్లు తెరుచుకున్నాయంటూ ఆయన వెళ్లిపోవడమేమిటో ఎవరికీ అర్థం కాదు. ఇక మురళీ శర్మ పాత్ర ఏమిటో .. ఆయనకి మీసాలు .. కొత్త క్రాఫు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఒక పట్టాన అంతుబట్టదు. 

మరోపక్క, జగపతిబాబు పాత్ర ఉద్దేశమేమిటో .. ఆయన విక్రమాదిత్యను ఎందుకు పిలిపించుకున్నాడో అర్థం కావాలంటే సినిమా మళ్లీ చూడవలసిందే. నేను చెప్పినట్టు వింటే నువ్వు ఇండియా వెళ్లడానికి సాయం చేస్తానని విక్రమాదిత్యతో జగపతిబాబు అంటాడు. విక్రమాదిత్య అసలు ఎందుకు ఇండియా వదిలివెళ్లిపోయాడో తనకే తెలియదని కృష్ణంరాజు చెబుతాడు. దీని వెనుక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనుకున్న ప్రేక్షకుడికి అలాంటిదేమీ తెరపై కనిపించదు. ఇలా బలహీనమైన పాత్రలతో .. స్క్రీన్ ప్లే తో కథ కళ్లుమూసుకుని నడుస్తుంటుంది.

ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ గురించే. ప్రతి సన్నివేశాన్ని తెరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. విజువల్ బ్యూటీ పరంగా చూసుకుంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. రెయిన్ సీన్స్ .. సముద్రంలో సీన్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. అయితే అక్కడక్కడా  ఆర్టిస్టులపై టైట్ క్లోజప్ షాట్స్ చూడటానికి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. 

ఇక జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు సందర్భానికి తగినట్టుగా .. అద్భుతమైన విజువల్స్ ను తోడు చేసుకుని నడుస్తాయి కనుక బాగానే అనిపిస్తాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మూడ్ లో నుంచి బయటికి రాకుండా చూస్తుంది. ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు పనితనం నీట్ గా ఉంది. 

ఇక ప్రభాస్ విషయానికి వస్తే చాలా నేచురల్ గా చేశాడు. అయితే రొమాంటిక్ హీరోగా ఆయన ఈ కథలో మరింత యాక్టివ్ గా కనిపిస్తే బాగుండేది. పూజ హెగ్డే మాత్రం ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి పాటలో ఆమె మరింత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. భాగ్యశ్రీ విషయానికి వస్తే లుక్ పరంగా అందంగా కనిపించింది అనే చెప్పగలం. మిగతా పాత్రల గురించి చెప్పడానికి ఏమీ లేదు. తెరపై ఎటు చూసినా ఖర్చు కనిపిస్తుంది .. కథ అప్పుడప్పుడు కనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక ఖరీదైన ప్రేమకథగా చెప్పుకోవచ్చు .. అంతే! 

--- పెద్దింటి గోపీకృష్ణ            

More Telugu News