Virat Kohli: బెంగళూరు డే/నైట్ టెస్టుకు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి

  • పూర్తిస్థాయి సామర్థ్యం నడుమ మ్యాచ్‌ను నిర్వహించాలని కేఎస్‌సీఏ నిర్ణయం
  • మిగతా 50 శాతం టికెట్ల నుంచి విక్రయం
  • స్టేడయం వద్దే కొనుగోలు చేసుకోవచ్చు
  • ఈ టెస్టులోనైనా కోహ్లీ సెంచరీ దాహం తీరుతుందా?
100 percent crowd to be allowed for day night Test in Bangalore

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. కోహ్లీ వందో టెస్టు ఆడిన మొహాలీ స్టేడియంలో కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. బెంగళూరు డే/నైట్ టెస్టుకు మాత్రం 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించినట్టు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పేర్కొంది.

మిగతా 50 శాతం టికెట్లు నేటి నుంచి స్టేడియం వద్ద అందుబాటులో ఉంటాయని కేఎస్‌సీపీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు బాక్సాఫీసు వద్ద టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. 

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ బెంగళూరును రెండో హోం పిచ్‌గా పరిగణిస్తాడు. ఈ నేపథ్యంలో వందో టెస్టులో సెంచరీ సాధించలేకపోయిన టీమిండియా మాజీ సారథి ఈ టెస్టులో శతకం నమోదు చేయాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే రెండేళ్ల సెంచరీ దాహం బెంగళూరులో తీరుతుంది. కోహ్లీ చివరిసారి నవంబరు 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడిది కూడా డే/నైట్ టెస్టే కాబట్టి అభిమానులు అతడి నుంచి సెంచరీ ఆశిస్తున్నారు.
ఇదిలావుంచితే, మొహాలీ టెస్టులో రోహిత్ సేన ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. 

More Telugu News