Russia: ర‌ష్యా యుద్ధ కాంక్ష‌ తీరిన‌ట్టేనా?.. రోజంతా కాల్పుల విర‌మ‌ణ‌

  • 24 గంట‌ల పాటు కాల్పుల విర‌మ‌ణ‌
  • నాటోలో చేర‌బోమంటూ ఉక్రెయిన్ ప్ర‌క‌ట‌న 
  • ర‌ష్యా చ‌మురు దిగుమ‌తుల‌పై అమెరికా నిషేధం
  • అదే బాట‌లో ప‌య‌నించ‌నున్న బ్రిట‌న్‌
cease fire in ukraine for 24 hours

ఉక్రెయిన్‌పైకి దండెత్తి వ‌చ్చిన ర‌ష్యా త‌న యుద్ధ కాంక్ష‌ను తీర్చుకున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. చ‌ర్చ‌ల స‌మ‌యంలోనూ సామాన్య పౌరుల ర‌క్ష‌ణార్ధం గంట‌ల వ్యవ‌ధి కాల్పుల విర‌మ‌ణ‌కు కూడా స‌సేమిరా అన్న ర‌ష్యా.. బుధ‌వారం నాడు ఏకంగా 24 గంట‌ల పాటు కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ర‌ష్యా డిమాండ్ల‌పై మొన్న‌టిదాకా గ‌ట్టిగానే నిల‌బ‌డ్డ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌ స్కీ మంగ‌ళ‌వారం మాత్రం ర‌ష్యాకు లొంగిపోయిన చందంగా మాట మార్చేసిన సంగ‌తి తెలిసిందే.

నాటోలో స‌భ్య‌త్వం కోసం ప‌ట్టుబ‌ట్టేది లేద‌న్న మాట‌ను చెప్పేసిన జెలెన్‌ స్కీ .. ర‌ష్యా కీల‌క డిమాండ్‌కు జైకొట్టేశారు. నాటోలో స‌భ్య‌త్వం కోసం ఉక్రెయిన్ ఎన్న‌టికీ య‌త్నించ‌రాద‌న్న‌ది ర‌ష్యా ప్ర‌ధాన డిమాండ్ అన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ర‌ష్యా భావించిన‌ట్లుగానే త‌మకు నాటోలో స‌భ్య‌త్వ‌మే అవస‌రం లేద‌ని జెలెన్ స్కీ చెప్ప‌డంతో ర‌ష్యా తొలి డిమాండ్‌కు ఉక్రెయిన్ త‌లొగ్గిన‌ట్టేన‌న్న మాట వినిపిస్తోంది.

 ఈ కార‌ణంగా బుధ‌వారం నాడు ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సామాన్య పౌరులు యుద్ధ భూమి నుంచి సుర‌క్షితంగా త‌ర‌లివెళ్లేందుకు ర‌ష్యా అంగీక‌రించింది. ఇందులో భాగంగా బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఉక్రెయిన్‌లోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో ఇరు దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌ను పాటించ‌నున్నాయి.

ఇదిలా ఉంటే.. అంద‌రూ అనుకున్న‌ట్లుగానే ర‌ష్యా చమురు దిగుమ‌తుల‌పై అమెరికా నిషేధం విధించింది. ర‌ష్యా నుంచి ఎలాంటి చ‌మురు దిగుమ‌తుల‌ను అనుమ‌తించేది లేదంటూ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు. అమెరికా బాట‌లోనే సాగ‌నున్న బ్రిట‌న్ కూడా త్వ‌ర‌లోనే ర‌ష్యా చ‌మురు దిగుమ‌తుల‌పై నిషేధం విధించే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

More Telugu News