Killing Stone: జపాన్ లో బద్దలైన 'కిల్లింగ్ స్టోన్'... ముమ్మరంగా మూఢనమ్మకాల ప్రచారం

  • నాసు ప్రాంతంలో అగ్నిపర్వతాల నడుము మృత్యుశిల
  • 1957 నుంచి చారిత్రక ప్రదేశంగా గుర్తింపు
  • ముక్కలైన స్థితిలో కనిపించిన మృత్యుశిల
  • జపాన్ పురాణాల్లో కిల్లింగ్ స్టోన్ వెనుక గాథ
Killing Stone in Japan split wide open

జపాన్ టెక్నాలజీ పరంగా ప్రపంచానికి మార్గదర్శి వంటి దేశం. అక్కడి ప్రజలు ఎంత విద్యావంతులైనప్పటికీ మూఢనమ్మకాల విషయంలో ఎవరికీ తీసిపోరు. ఇంతకీ విషయం ఏమిటంటే... జపాన్ లోని నాసు ప్రాంతంలో ఓ కిల్లింగ్ స్టోన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ శిలలో ఓ దెయ్యం కాపురం ఉంటుందన్నది అక్కడి వారి నమ్మకం. ఈ మృత్యు శిలను అక్కడివారు సెషో-సెకి అని పేర్కొంటారు. 

అయితే, ఆదివారం నాడు ఆ కిల్లింగ్ స్టోన్ ముక్కలైంది. దాంతో స్థానికులు హడలిపోతున్నారు. ఆ పురాతన శిల ఇప్పుడు బద్దలవడం అరిష్టమని ప్రచారం జరుగుతోంది. 

జపాన్ పురాణాల ప్రకారం... సెషో-సెకి శిలను తాకినవాళ్లు చనిపోతారట. చూడడం కూడా నష్టదాయకం అని చెబుతుంటారు. ఆ శిలలో తొమ్మిది తోకల నక్క రూపంలో ఉండే పిశాచి నివసిస్తుంటుందని ఆ పురాణాల్లో పేర్కొన్నారు. ఆ మాయలమారి నక్క అందమైన 'తమామో నో మే' అనే సుందరాంగిలా మారి టోబా చక్రవర్తిని కడతేర్చేందుకు కుట్ర పన్నిందని, అయితే యుద్ధంలో తమామో ఓడిపోవడంతో ఆమె ఆత్మ మృత్యుశిలలో చిక్కుకుపోయిందని భావిస్తుంటారు. 

ఈ శిల నాసు ప్రాంతంలోని అగ్నిపర్వతాల నడుమ ఉంటుంది. 1957 నుంచి ఇది చారిత్రాక ప్రదేశంగా గుర్తింపు పొందింది.  అసలు, ఆ మృత్యు శిలను పగిలి ముక్కలైన స్థితిలో చూడడం కూడా అశుభమేనని ఓ జపాన్ నెటిజన్ అంటున్నాడు. కాగా, జపాన్ కు చెందిన యోమియురి షింబున్ అనే వెబ్ సైట్ మాత్రం వర్షం, ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం కారణంగానే ఆ రాయి పగుళ్లు వచ్చి ముక్కలై ఉంటుందని పేర్కొంది.
.

More Telugu News