Imran Khan: పాకిస్థాన్ ఏమైనా మీకు బానిసా? ఇండియాకు ఇలాంటి లేఖ రాయగలరా?: ఇమ్రాన్ ఖాన్ ఫైర్

  • రష్యా యుద్ధం వ్యతిరేక తీర్మానానికి మద్దతు పలకాలన్న పాశ్చాత్య దేశాల రాయబారులు
  • మీరు చెప్పినట్టు చేయడానికి మేము మీ బానిసలా అని ప్రశ్నించిన ఇమ్రాన్
  • తాము తటస్థంగా ఉంటామని వ్యాఖ్య
Are We Your Slaves Pak PM Slams Western Envoys

పాకిస్థాన్ లో ఉన్న పాశ్చాత్య దేశాల రాయబారులపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను పాకిస్థాన్ ఖండించాలంటూ గత వారం వీరు కోరారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ... పాకిస్థాన్ ఏమైనా మీకు బానిసా? అని మండిపడ్డారు. 

యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు 22 దేశాల రాయబారులు ఈ నెల 1వ తేదీన ఒక సంయుక్త బహిరంగ లేఖను విడుదల చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మద్దతు పలకాలని లేఖలో పాకిస్థాన్ ను కోరారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 

'మా గురించి మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పిన విధంగా చేయడానికి మేమేమైనా మీ బానిసలమా? ఇలాంటి లేఖను ఇండియాకు రాయగలరా? అని యూరోపియన్ యూనియర్ రాయబారులను అడుగుతున్నా. మేము రష్యాకు స్నేహితులం. అమెరికాకు కూడా మిత్రులమే. మేము చైనా, యూరప్ లకు కూడా స్నేహితులమే. మేము ఏ ఒక్క వర్గంలోనూ లేము. మేము తటస్థంగా ఉంటాం. ఉక్రెయిన్ లో యుద్ధం ఆపడానికి కృషి చేసే వారితో కలిసి పని చేస్తాం' అని చెప్పారు.

More Telugu News