healthy foods: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు అవసరం!

  • నేడు మహిళలకు ఎన్నో వ్యాధుల రిస్క్
  • పెరుగుతున్న కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం కేసులు
  • ఆహార పరమైన మార్పులతో తగినంత రక్షణ
  • బ్రకోలి, సోయా, పసుపుతో మంచి ఫలితాలు
Five healthy foods women should eat every day

మహిళలు కుటుంబం కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతుంటారు. ఉద్యోగం చేసే మహిళలు అయితే, అటు గృహిణిగా, ఇటు ఉద్యోగిగా రెండు రకాల పాత్రలను పోషిస్తుంటారు. కుటుంబం కోసం ఎంతో చేస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. 

ఈ క్రమంలో గతంతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బుల ముప్పు పెరిగింది. అలాగే, పురుషులతో పోలిస్తే స్ట్రోక్ ముప్పు (పక్షవాతం) మహిళల్లోనే ఎక్కువగా ఉంటోంది. మధుమేహం ముప్పు కూడా ఎక్కువే. దీనికి తోడు ఒత్తిళ్లతోనూ వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇవన్నీ వారి రుతు చక్రంపై, థైరాయిడ్ హార్మోన్ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. 

అలాగే, కేన్సర్ కేసులు మహిళల్లోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. క్యాల్షియం, విటమిన్ డి లోపంతో ఆస్టియో పోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలు కూడా వారిని వేధిస్తున్నాయి. అందుకని కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో తీసుకోవడం మహిళలకు ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

బ్రకోలి 

క్యాలిఫ్లవర్ మాదిరిగా ఉండే ఇది మన మార్కెట్లలోనూ లభ్యమవుతోంది. ఆకుపచ్చని రంగుతో ఉండే ఇది మంచి పోషకాల నిలయం. కూర, సూప్, సలాడ్స్ ఎన్నో రూపాల్లో దీన్ని తీసుకోవచ్చు.  బ్రకోలీలో సల్ఫోరఫేన్ అనే రసాయనం ఉంటుంది. ల్యుకేమియా (బ్లడ్ కేన్సర్) కణాలను ఇది అంతం చేయడంలో సాయపడుతుంది. ఒక కప్పు బ్రకోలీతో ఒక రోజుకు సరిపడా విటమిన్ సి లభిస్తుంది. 

వేరుతో ఉండే కూరగాయలు
ఫైటో న్యూట్రియంట్లు సమృద్ధిగా లభించే బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, చిలగడ దుంపను మహిళలు రోజువారీ ఆహారంలో తీసుకునేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో సాయపడతాయి. చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిల్లోని పొటాషియం, ఫొలేట్, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్ మంచి ఆరోగ్యానికి ఎంతో సాయపడతాయి. బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణకు చిలగడ దుంప సాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.

పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్లు కూడా ఉన్నాయి. ఇన్ ఫ్లమేషన్ తక్కువగా ఉండేలా చూసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ముప్పులను నివారించుకోవచ్చని ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. రక్తనాళాల్లో ఇన్ ఫ్లమేషన్ (వాపు) వల్ల గుండె జబ్బులు, కేన్సర్, అల్జీమర్స్ ముప్పు పెరుగుతుంది. ఈ రిస్క్ ను తగ్గించుకునేందుకు పుసుపును ఆహారంలో భాగంగా రోజూ తీసుకోవాలి. 

గ్రీక్ యోగర్ట్/పెరుగు
పెరుగు తీసుకోవడం ద్వారా క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవచ్చు. ఇతర పాల పదార్థాలు తీసుకున్నా క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అందుతుంది. ఎముకల బలానికి ఇవి అవసరం. గ్రీక్ యోగర్ట్, పెరుగు (ఫ్రీజులో ఉంచని)లో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణక్రియలు ఆరోగ్యంగా జరుగుతాయి. అంతేకాదు 200 గ్రాముల యోగర్ట్ లో 12 గ్రాముల ప్రొటీన్ కూడా లభిస్తుంది.

సోయాబీన్
సోయా ఉత్పత్తుల్లో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ కు ఇది మరో రూపం. అమైనో యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, కేన్సర్ ల నుంచి రక్షణ ఇస్తాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. 

More Telugu News