Team India: వారెవ్వా జడేజా... మూడ్రోజుల్లోనే శ్రీలంకను ఫినిష్ చేసిన టీమిండియా

  • మొహాలీలో తొలి టెస్టు
  • లంకపై ఇన్నింగ్స్ 222 రన్స్ తేడాతో భారత్ విజయం
  • జడేజా ఆల్ రౌండ్ షో
  • 175 పరుగులు... 9 వికెట్లతో సత్తా చాటిన జడ్డూ
  • సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యం
Team India finishes first test against Sri Lanka in just three days

మొహాలీ టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణించిన వేళ... శ్రీలంకపై టీమిండియా అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చాటుకుంది. మొహాళీలో మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో తిరుగులేని గెలుపు నమోదు చేసింది. 

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ను 574-8 వద్ద డిక్లేర్ చేయగా.... శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 174 ఆలౌటై ఫాలో ఆన్ లో పడింది. రెండో ఇన్నింగ్స్ లోనూ లంకేయుల ఆటతీరు మెరుగుపడలేదు. మొహాలీ పిచ్ లో భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. చివరికి రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే చేతులెత్తేశారు. 

కాగా, జడేజా తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగుల అజేయ సెంచరీ చేయడమే కాదు, బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. లంక తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ, ఆపై రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. మొత్తమ్మీద ఈ టెస్టును జడేజా చిరస్మరణీయం చేసుకున్నాడు. అటు, లంక రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాదే హయ్యస్ట్ స్కోర్. డిక్వెల్లా 51 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 4, షమీ 2 వికెట్లు తీశారు. 

ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మార్చి 12 నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

More Telugu News