Telangana: అత్యవసర సమయాల్లో చికిత్స కోసం తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే.. ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

  • ములుగు జిల్లాలో లాంఛనంగా ప్రారంభం
  • పలువురికి డిజిటల్ హెల్త్ కార్డుల అందజేత
  • 40 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్న మంత్రి
Health Profile Survey In Telangana Kick Starts

తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ సర్వేని ప్రారంభించింది. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఆయన లాంఛనంగా దీనిని మొదలుపెట్టారు. జిల్లా ఆసుపత్రి, రూ.31 లక్షలతో పీడియాట్రిక్ విభాగం, రూ.60 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. పలువురికి డిజిటల్ హెల్త్ కార్డులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. 

హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య సమాచారంతో నివేదికను తయారు చేయనున్నారు. సర్వే తర్వాత వారికి డిజిటల్ హెల్త్ కార్డును అందించనున్నారు. హెల్త్ ప్రొఫైల్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని హరీశ్ రావు అన్నారు. వైద్య సేవలను మరింత విస్తరించడంలో భాగంగానే హెల్త్ ప్రొఫైల్ ను చేపట్టామన్నారు. ములుగు జిల్లాలో 40 రోజుల్లోనే ఈ సర్వేని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 

సర్వేని పూర్తి చేసేందుకు 197 బృందాలు పనిచేస్తాయన్నారు. సర్వే కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని చెప్పారు. సర్వే వివరాలన్నీ వెబ్ సైట్ లో అందుబాటులో పెడతామని, అత్యవసర సమయంలో చికిత్స చేసేందుకు ఆ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, గిరిజన యూనివర్సిటీకి రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. వర్సిటీలో 90 శాతం సీట్లను గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News