Virat Kohli: వందో టెస్టులో కోహ్లీ ఎన్ని పరుగులు చేసి, ఎవరి బౌలింగులో అవుటవుతాడో కరెక్టుగా ఊహించిన ట్విట్టర్ యూజర్.. వైరల్ అవుతున్న ట్వీట్

  • 45 పరుగులు చేసి ఎంబల్‌దెనియా బౌలింగులో అవుటవుతాడని ఊహించిన ట్వీటరాటీ
  • సరిగ్గా అలాగే అవుటైన కోహ్లీ
  • కామెంట్లతో హోరెత్తుతున్న ట్వీట్
  • నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ఎప్పుడొస్తాడో చెప్పమన్న మరో యూజర్
Kohli fangirls shockingly accurate prediction about his score

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లికి వందోది. అలా వందో టెస్టు ఆడుతున్న అతి కొద్ది మంది క్రికెటర్లలో కోహ్లీ ఒకడు కావడంతో ఈ టెస్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వందో టెస్టులో కోహ్లీ వంద పరుగులు సాధించి ఈ మ్యాచ్‌ను ఓ మధురానుభూతిగా మిగుల్చుకుంటాడని అభిమానులు భావించారు. 

అయితే, ఓ ట్విట్టర్ యూజర్ మాత్రం  కోహ్లీ తన వందో టెస్టులో సరిగ్గా ఎన్ని పరుగులు చేసి, ఎవరి బౌలింగులో అవుటవుతాడో ఊహించి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం.. ఆ యూజర్ ఊహించినట్టుగానే అవుట్ కావడం. 

కోహ్లీ ఈ మ్యాచ్‌లో సరిగ్గా 100 బంతులు ఆడి 45 పరుగులు చేస్తాడని ఆ యూజర్ అంచనా వేశారు. అందులో అద్భుతమైన నాలుగు కవర్ డ్రైవ్‌లు కూడా ఉంటాయని, చివరికి ఎంబల్‌దెనియా బౌలింగులో బౌల్డై నిరాశగా వెనుదిరుగుతాడని shruti #100 అనే యూజర్ ట్వీట్ చేశారు. విచిత్రం ఏమిటంటే సరిగ్గా ఆ యూజర్ చెప్పినట్టే కోహ్లీ అవుటయ్యాడు. 

కోహ్లీ 100 బంతులు ఎదుర్కొంటాడని ఆ యూజర్ చెప్పగా 76 బంతులు మాత్రమే ఆడాడు. 45 పరుగులు చేస్తాడని ఊహించగా, సరిగ్గా అన్నే పరుగులు చేశాడు. నాలుగు కవర్ డ్రైవ్‌లు కొడతాడని ఊహిస్తే ఒకటి ఎక్కువగా ఐదు ఫోర్లు కొట్టాడు. ఆ యూజర్ గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరి బౌలింగులో అవుటవుతాడో కూడా కచ్చితంగా అంచనా వేయడం. ఆ యూజర్ చెప్పినట్టుగానే ఎంబల్‌దెనియా బౌలింగులోనే కోహ్లీ బౌల్డ్ అయి తీవ్ర నిరాశగా వెనుదిరిగాడు. 

టీమిండియా మాజీ డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దృష్టికి ఈ ట్వీట్ చేరడంతో ‘వావ్’ అని స్పందించి రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండడంతో శ్రుతి అనే ఆ యూజర్‌ను మరిన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పాలని కొందరు కామెంట్ చేస్తే.. నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ఎప్పుడొస్తాడో దయచేసి చెప్పాలని మరొకరు కోరారు. ‘బీస్ట్’ రిలీజ్ డేట్ చెప్పాలని విజయ్ అభిమానులు కోరితే, ఆ యూజర్‌తో టీవీ చానళ్లు ఇంటర్వ్యూ చేయాలని మరొకరు.. ఇలా.. రకరకాల కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.

More Telugu News