Bay Of Bengal: దక్షిణ కోస్తా, రాయలసీమకు పొంచివున్న వాయుగుండం ముప్పు

  • నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం 
  • అల్లకల్లోలంగా మారనున్న సముద్రం
  • ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం
  • ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Rains expected in South Coastal Andhra and Rayalaseema amid low pressure in Bay of Bengal

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. నిన్న మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రికోమలైకి 360, తమిళనాడులోని నాగపట్నానికి 700, చెన్నైకి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. 

దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఎల్లుండి (6వ తేదీ) వరకు జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖలు హెచ్చరించాయి. అలాగే, వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

More Telugu News