Amaravati: అమ‌రావ‌తి విష‌యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మంత్రులేమ‌న్నారంటే..!

  • రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌న్న‌హైకోర్టు
  • తీర్పును స్వాగ‌తించిన విప‌క్ష‌ టీడీపీ
  • టీడీపీ వైఖ‌రిపై నిప్పులు చెరిగిన మంత్రి వెల్లంపల్లి 
  • అన్ని ప్రాంతాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న బొత్స‌
botsa satyanarayana and vellampalli srinivas response on aphigh court judgement

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌తోనే స్పందిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు క‌దులుతున్న‌ట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కేబినెట్‌లోని కీల‌క మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఇప్ప‌టికే హైకోర్టు తీర్పుపై స్పందించారు.  

రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు, రాష్ట్రాభివృద్ధే త‌మ అభిప్రాయం అని మునిసిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పిన ఆయ‌న‌.. శాస‌న‌స‌భ‌కు చ‌ట్టాలు చేసే అధికారం లేద‌నడాన్ని ఏ ఒక్క‌రూ విశ్వ‌సించ‌ర‌ని కూడా కీల‌క వ్యాఖ్య చేశారు. ఏది ఏమైనా హైకోర్టు తీర్పున‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ప‌రిశీలించాకే ఈ తీర్పుపై స్పందిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఇక దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే.. హైకోర్టు తీర్పును టీడీపీ స్వాగ‌తించ‌రాద‌న్న కోణంలో త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని నిర్మాణానికి బంగారం లాంటి భూముల‌ను త్యాగం చేసిన అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్ల‌రాద‌న్న టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. అప్పీల్‌కు వెళ్లొద్ద‌ని చెప్ప‌డానికి య‌న‌మ‌ల ఎవ‌రు? అని ప్ర‌శ్నించిన మంత్రి.. స‌రైన నిర్ణ‌యాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. హైకోర్టు తీర్పును ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పిన వెల్లంపల్లి.. రైతుల‌కు ప్ర‌భుత్వం అన్యాయం చేయ‌బోద‌ని చెప్పారు.

More Telugu News