Indian Students: రైళ్లన్నీ ఉక్రెయిన్ ప్రజల కోసమే... మేం ఎక్కబోతే తీవ్రంగా కొడుతున్నారు: భారతీయ విద్యార్థుల ఆవేదన

  • ఖర్కీవ్ పై రష్యా దళాల బాంబుల వర్షం
  • ఖర్కీవ్ ను వీడాలంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక
  • రైళ్లలో ఎక్కించుకోవడంలేదన్న భారత విద్యార్థులు
  • తుపాకీతో బెదిరిస్తున్నారని వెల్లడి
  • అమ్మాయిలపైనా చేయి చేసుకుంటున్నారని వివరణ
Indian students says they were denied to onboard trains

ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ ను వీడాలంటూ కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులకు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. అందుబాటులో ఉన్న రవాణా సాధనాలు ఏది దొరికితే అది ఉపయోగించుకోవాలని, వీలుకాకపోతే కాలినడకనైనా ఖర్కీవ్ ను వీడాలని స్పష్టం చేసింది. కానీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ప్రగుణ్ అనే విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 

రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే తమను దారుణంగా కొడుతున్నారని, కేవలం ఉక్రెయిన్ ప్రజలనే రైళ్లలోకి అనుమతిస్తున్నారని ప్రగుణ్ వెల్లడించాడు. "ప్రస్తుతం ఖర్కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. తలదాచుకోవడానికి దగ్గర్లో బంకర్ కూడా లేదు. అందరం బయటే ఉన్నాం. రైల్వే స్టేషన్ లో మా ఎదురుగా ఓ రైలు ఉంది... కానీ అందులో మేం ఎక్కడానికి వీల్లేదంటున్నారు. అదేమని అడిగితే ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా కొడుతున్నారు. గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. 

రైల్వే స్టేషన్ వద్ద దాదాపు 1000 మంది భారతీయులం చిక్కుకుపోయి ఉన్నాం. అసలు ఈ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవడానికే ప్రాణాలకు తెగించి వచ్చాం. సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఈ సమయంలో భారత ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే... మాకేదైనా జరిగితే మా కుటుంబాలను ఆదుకోండి" అంటూ ప్రగుణ్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చాడు. 

కాగా, మరో విద్యార్థి ఖర్కీవ్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితిని వీడియో రూపంలో పంచుకున్నాడు. తాము మూడు గంటలుగా ఎదురుచూస్తున్నా ఒక్క రైల్లోనూ అనుమతించలేదని వాపోయాడు. ఓ రైలు వస్తే ఎక్కామని, అయితే వెంటనే దిగిపొమ్మంటూ ఆదేశించారని వెల్లడించాడు. తమను ఎందుకు దింపేశారో అర్థంకావడంలేదని పేర్కొన్నాడు. తర్వాత వచ్చే రైల్లో అయినా తమను ఎక్కనిస్తారో లేదోనని ఆ విద్యార్థి పేర్కొన్నాడు. 

హిమాంశు రాజ్ మౌర్య అనే మరో విద్యార్థి మాట్లాడుతూ, ఉక్రెయిన్ సాధారణ పౌరులు కూడా తమను రైళ్లలో ఎక్కేందుకు అనుమతించడంలేదని వెల్లడించాడు. వారి వద్ద ఉన్న తుపాకులతో భయపెడుతున్నారని వివరించాడు. తమ బృందంలో విద్యార్థినులు కూడా ఉన్నారని, అమ్మాయిలు అని కూడా చూడకుండా వారిపైనా చేయి చేసుకుంటున్నారని తెలిపాడు. 

కేంద్ర ప్రభుత్వం తమను కొన్ని ప్రాంతాలకు చేరుకోవాలని చెబుతోందని, కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే అందుకు ఏమాత్రం అనువుగా లేవని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఎటు చూసినా బాంబుల మోతతో దద్దరిల్లిపోతోందని వెల్లడించాడు.

More Telugu News