Ukraine: కాల్పులు ఆపండి.. ర‌ష్యా, ఉక్రెయిన్‌ల‌కు ఐరాస పిలుపు

  • యుద్ధం నేప‌థ్యంలో ఐరాస్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ అత్య‌వ‌స‌ర స‌మావేశం
  • మృతుల‌కు అసెంబ్లీ సంతాపం
  • ఉక్రెయిన్‌కు చేయూత‌ను కొనసాగిస్తామని గుటెర‌స్ ప్ర‌క‌ట‌న‌
uno urged russia and ukraine to stop war

త‌క్ష‌ణ‌మే కాల్పులు ఆపాల‌ని ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల‌కు ఐక్య‌రాజ్య స‌మితి పిలుపునిచ్చింది. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించ‌డంతో పాటు ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొనేలా చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాల‌ని ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీ సూచించింది. 

ర‌ష్యా యుద్ధోన్మాదం కార‌ణంగా ఉక్రెయిన్‌లో నెల‌కొన్న సంక్షోభం నేప‌థ్యంలో ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాన్ని సోమ‌వారం అత్య‌వ‌స‌రంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని ఐరాస సూచించింది. స‌మావేశం సంద‌ర్భంగా ర‌ష్యా యుద్ధం కార‌ణంగా చ‌నిపోయిన మృతుల‌కు సంతాపం ప్ర‌క‌టించింది. 

ఈ సంద‌ర్భంగా జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆటోనియో గుటెర‌స్ ఇరు దేశాల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. నానాటికీ పెరిగిపోతున్న హింస ద్వారా అనేక మంది సాధార‌ణ పౌరులు చ‌నిపోతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టిదాకా జ‌రిగిన దానిని ప‌క్క‌న‌పెట్టేసి ఇరు దేశాల సైనికులు త‌మ స్థావ‌రాల‌కు వెళ్లిపోవాల‌ని ఆయ‌న సూచించారు.

హింస‌తో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌దని, శాంతితోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. యుద్ధం కార‌ణంగా ఇబ్బందుల్లో ప‌డ్డ ఉక్రెయిన్‌కు ఐరాస చేయూత‌నందిస్తుంద‌ని, ఆ దేశాన్ని అలా వ‌దిలేయ‌మ‌ని కూడా గుటెర‌స్ చెప్పారు.

More Telugu News