Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్ల తరబడి జ‌రిగే అవకాశం: బ్రిటన్‌ విదేశాంగ మంత్రి

  • ర‌ష్యా సైన్యం శ‌క్తిమంత‌మైంది
  • ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు ధైర్యమెక్కువ 
  • ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం లేదు
  • పుతిన్ ప్ర‌మాద‌క‌ర ఆయుధాలు వాడే ముప్పు ఉంద‌న్న బ్రిట‌న్
britain on russia war

ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంలో ప్ర‌జ‌లు భయంభయంగా గడుపుతోన్న విష‌యం తెలిసిందే. కొంద‌రు ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటుండ‌గా మ‌రికొంద‌రు సామాన్య పౌరులు మాత్రం ఆయుధాలు చేత‌బ‌ట్టి ర‌ష్యా సైన్యానికి చుక్క‌లు చూపిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందుతున్నాయి. 

దీంతో ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఆయుధాలు ఇస్తోంది. భీకర పరిస్థితుల మ‌ధ్య ఉక్రెయిన్ ప్ర‌జ‌లు పోరాడుతోన్న తీరు ఆద‌ర్శంగా నిలుస్తోంది. ర‌ష్యాకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లొంగిపోయేది లేద‌ని ఉక్రెయిన్ చెబుతుండ‌డం, ఉక్రెయిన్ వెన‌క్కి త‌గ్గేదాక దాడులు కొన‌సాగేలా ర‌ష్యా చర్య‌లు తీసుకుంటుండ‌డంతో దీనిపై బ్రిట‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే ముప్పు ఉందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్ తెలిపారు. 

రష్యా సైన్యం శక్తిమంతంగా ఉంద‌ని అన్నారు. మ‌రోవైపు, ఉక్రెయిన్ పౌరులు ధైర్యవంతులని, దేనికీ భ‌య‌ప‌డ‌బోర‌ని తెలిపారు. త‌మ‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్ర‌జ‌లు చివ‌రి వ‌ర‌కూ పోరు కొనసాగిస్తారని ఆమె స్ప‌ష్టం చేశారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొన‌సాగుతుంద‌ని, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ మరింత శక్తిమంతమైన ఆయుధాలను వాడే ముప్పు ఉంద‌ని ఆమె హెచ్చ‌రించారు. 

కాగా, ర‌ష్యా-ఉక్రెయిన్ ఇప్ప‌టికే చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించాయి. ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న బెలారస్ ‌లో చ‌ర్చ‌లకు ఒప్పుకోబోమ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ మొద‌ట చెప్పిన‌ప్ప‌టికీ, చివ‌ర‌కు బెలార‌స్‌లోనే ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చ‌లకు అంగీక‌రించారు. ఈ చ‌ర్చ‌ల కోసం బెలార‌స్‌కు రష్యా, ఉక్రెయిన్ బృందాలు వెళ్ల‌నున్నాయి. బెలార‌స్‌లోని గోమెల్‌లో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు వేదిక‌ను కూడా ఇప్ప‌టికే సిద్ధం చేశారు.

More Telugu News