Perni Nani: పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం మాకు లేదు.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా?: పేర్ని నాని

  • సినిమాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు
  • ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారు
  • సినిమాను ఫ్రీగా చూపిస్తానని పవన్ అన్నారన్న మంత్రి 
Chandrababu not cares Junior NTR film says Perni Nani

పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'భీమ్లా నాయక్' ఈ రోజు విడుదలైంది. అయితే టికెట్ ధరలు పెంచుతామన్న ఏపీ ప్రభుత్వం ఇంకా పెంచకపోవడం, పలు థియేటర్లలో సినిమా విడుదలకు తీవ్ర ఆటంకాలు ఎదురుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిల కార్లను పవన్ అభిమానులు అడ్డుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సినిమాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఏనాడైనా చంద్రబాబు, నారా లోకేశ్ పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.

మంత్రి గౌతమ్ రెడ్డి మరణం బాధలో తామున్నామని... అందువల్లే టికెట్ ధరలకు సంబంధించిన జీవో ఆలస్యమయిందని చెప్పారు. సినిమాలో దమ్ముంటే విజయం సాధిస్తుందని... లేకపోతే మరో 'అజ్ఞాతవాసి' అవుతుందని అన్నారు. తన సినిమాను ఉచితంగా చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేశారు.

More Telugu News