US: రష్యా చేతులు కట్టేద్దాం.. మాతో కలిసి రండి.. భారత్ పై ఒత్తిడి పెంచిన అమెరికా

  • ముందస్తు పథకం ప్రకారమే రష్యా దాడి
  • బలమైన ప్రతిస్పందన అవసరం
  • జైశంకర్ తో ఆంటోనీ బ్లింకెన్ చర్చలు
US Stresses On Collective Response To Ukraine Crisis

ఉక్రెయిన్ పై రష్యా చర్యలను అడ్డుకునేందుకు తమతో కలసి రావాలని అమెరికా భారత్ ను కోరింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై దాడిని ఖండించేందుకు బలమైన ఉమ్మడి స్పందన అవసరాన్ని గుర్తు చేశారు. ఉక్రెయిన్ పై ముందస్తు ప్రణాళిక మేరకు దాడికి దిగిన రష్యా చర్యపై జైశంకర్ తో బ్లింకెన్ మాట్లాడినట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ గురువారం మీడియాకు తెలిపారు.

ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై భారత్ తో చర్చించనున్నట్టు, ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు ప్రారంభించలేదని అంతకుముందు వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. తర్వాత కొంత సమయానికే బ్లింకెన్-జైశంకర్ మధ్య చర్చలు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం, విదేశాంగ శాఖ, జాతీయ భద్రతా మండలికి చెందిన అధికారులు భారత్ లోని ఆయా విభాగాల అధినేతలతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.

నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించే విషయంలో భారత్ వైఖరి పట్ల అమెరికా సంతోషంగా లేదు. ఇదే విషయాన్ని భారత్ లోని అధికారులకు అమెరికా అధికారులు తెలియజేసినట్టు సమాచారం. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ గత రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్లో మాట్లాడడం గమనార్హం. హింసకు ముగింపు చెప్పి, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని మోదీ సూచించారు.

More Telugu News