Pawan Kalyan: భీమ్లా నాయక్ అదరగొట్టేశాడు.. బ్లాక్ బస్టర్ అంటున్న ట్విట్టర్ రివ్యూలు

  • యూఎస్‌లో ప్రీమియర్, ఏపీ, తెలంగాణలో బెనిఫిట్‌ షోలు
  • రానా పాత్ర సినిమాకే హైలైట్ అంటున్న ఫ్యాన్స్
  • అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ రివ్యూలు
  • పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ విశ్వరూపం
Pawan Kalyan Bheemla Naik Review in Twitter

పవన్ కల్యాణ్ రాజకీయ ఎంట్రీ తర్వాత చేస్తున్న రెండో చిత్రం భీమ్లా నాయక్‌పై అభిమానుల్లోనే కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీలోనే బోల్డన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ముందు వచ్చిన వకీల్‌సాబ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై బోల్డన్ని అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికీ పవన్‌పై క్రేజ్ తగ్గలేదని సినిమా నిరూపించింది. ఇప్పుడు భీమ్లానాయక్‌గా పవన్ ఏమేరకు మెప్పించాడన్న దానిపై ఇటు సినీ వర్గాలతోపాటు, సగటు అభిమానుల్లోనూ బోల్డంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భీమ్లానాయక్ సినిమా.. మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోశియమ్‌కు రీమేక్. అక్కడ బిజు మీనన్, పృథ్వీరాజ్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి చేశారు. సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్ జరగ్గా, ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఇవి చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. దాదాపు అందరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు.  బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దర్శకుడి టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమాకు ఊపు వస్తుందని, ఆ తర్వాతి నుంచి ప్రతి సన్నివేశం కళ్లు తిప్పుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా, పవన్ కల్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు రానా నటన ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. నెగటివ్ షేడ్స్‌లో రానా కుమ్మేశాడని అంటున్నారు.

సినిమా గురించి ట్వీట్ చేస్తున్న వారిలో ఎక్కువమంది రానా నటన గురించే చెబుతున్నారు. డేనియల్ శేఖర్ పాత్రకు రానా అద్భుతంగా సూటయ్యాడని ప్రశంసిస్తున్నారు. పవన్ మాస్ అప్పియరెన్స్, డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ‘నాయక్‌కు పెళ్లామంటే నాయక్‌లో సగం కాదు.. నాయక్‌కు డబుల్’ అని నిత్యామీనన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రావు రమేశ్, మురళీ శర్మ పాత్రలు బాగున్నాయి. చివర్లో బ్రహ్మానందం మెరుపులు మెరిపించాడు. థమన్ సంగీతం ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే సినిమా స్థాయిని పెంచింది. మొత్తంగా చెప్పాలంటే భీమ్లానాయక్ పవన్ అభిమానులకు పసందైన విందు.

ఇక,  సినిమా కథ గురించి చెప్పాలంటే.. తెగింపు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ అదరగొట్టగా, మద్యం మాఫియా డాన్‌గా రానా.. పవన్‌ను ఎదుర్కొనే పాత్రలో కనిపిస్తాడు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న డేనియల్‌ను భీమ్లా అరెస్ట్ చేస్తాడు. అతడిని అవమానకర పద్ధతిలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తాడు. డేనియల్ ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ అని, ఓ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి (సముద్రఖని) కొడుకని భీమ్లాకు తెలియదు. విషయం తెలిసిన తర్వాత డేనియల్‌కు సారీ చెప్పి విడుదల చేయించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇగోలు మొదలవుతాయి. అవి మరింత పెరిగి ఇద్దరి మధ్య యుద్ధానికి దారి తీస్తాయి. ఈ యుద్ధంలో చివరికి విజయం ఎవరిని వరించిందన్నదే సినిమా అసలు కథ.

More Telugu News