Team India: తొలి టీ20లో లంకపై ఘన విజయం సాధించిన భారత్

  • ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వీరబాదుడు
  • 89 పరుగులు చేసిన కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
  • రేపు ధర్మశాలలో రెండో మ్యాచ్
India beat sri lanka by 60 runs

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వీర విజృంభణతో భారత్ తొలుత 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 200 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

శ్రీలంకకు ఇన్నింగ్స్‌ తొలి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ పాతుమ్ నిశ్శంక గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 15 పరుగుల వద్ద భువీనే మరో దెబ్బ కొట్టాడు. ఈసారి మరో ఓపెనర్ కామిల్ మిషారా(13)ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా శ్రీలంక వికెట్ల పతనం ఆగలేదు.

జనిత్ లియనాగె(11)ను వెంకటేశ్ అయ్యర్ ఔట్ చేయడంతో శ్రీలంక పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీయడంతో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒకరి తర్వాత ఒకరిగా పెవిలియన్ చేరారు. అయితే, చరిత్ అసలంక మాత్రం క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేసి జడేజా బౌలింగులో అవుటయ్యాడు. దీంతో శ్రీలంక ఓటమి ఖాయమైంది.

కెప్టెన్ దాసున్ షనక మూడు పరుగులు మాత్రమే చేసి చాహల్‌కు దొరికిపోయాడు. చివర్లో చమిక కరుణరత్నె (21), దుష్మంత చమీర (24) కాసేపు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, చాహల్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ దక్కింది.

అంతకుముందు భారత జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇషాన్ 56 బంతుల్లో 10 ఫోర్లు మూడు సిక్సర్లతో 89 పరుగులు చేయగా, అయ్యర్ 28 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ రేపు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.

More Telugu News