Pawan Kalyan: ఈ వాస్తవాన్ని కేటీఆర్ మరోసారి తెలియజెప్పారు: పవన్ కల్యాణ్

  • హైదరాబాదులో ఘనంగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక
  • ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
  • పవన్ ను సోదరుడిగా పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్
  • మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన పవన్ 
Pawan Kalyan says heartfelt thnaks to KTR for graced Bheemla Nayak pre release event

హైదరాబాదులో జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకావడం తెలిసిందే. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ, పవన్ కల్యాణ్ ను సోదరుడిగా పేర్కొన్నారు. అందుకు పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

"కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత భేదాలు ఉండవని, భావ వైరుధ్యాలు అడ్డం కాబోవన్న వాస్తవాన్ని కేటీఆర్ మరోసారి తెలియజెప్పారు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలక వర్చువల్ సమావేశానికి సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నప్పటికీ సమయం వెసులుబాటు చేసుకుని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంతటి భావ వైరుధ్యాలు ఉన్నా, రాజకీయ విమర్శలు చేసుకున్నా... వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుతం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పార్టీల వారు ఆత్మీయంగా ఉండడాన్ని చూస్తాం. అలాంటి ఆత్మీయతే కేటీఆర్ లోనూ స్పష్టంగా కనిపిస్తుంది.

సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తుండడమే కాదు, ఈ రంగం అభివృద్ధికి అవసరమైన ఆలోచనలను కేటీఆర్ చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.

More Telugu News