Russia: డేటా మొత్తాన్ని తుడిచిపెట్టేసే ‘వైపర్’ మాల్వేర్​ తో ఉక్రెయిన్​ పై సైబర్​ దాడి.. ప్రభుత్వ వెబ్ సైట్లు, ప్రజల కంప్యూటర్లపై దాడులు

  • ఎవరు చేశారన్నదానిపై స్పష్టత కరవు
  • చాలా చాలా పెద్ద సంస్థలు ప్రభావితమయ్యాయంటున్న నిపుణులు
  • బుధవారం దాడులకు కొనసాగింపన్న ప్రభుత్వం
Now Ukraine Witnessing Proxy War Hackers Attacked Government Sites

ఉక్రెయిన్ పై ప్రత్యక్ష దాడులు కొనసాగుతున్న సమయంలోనే పరోక్ష దాడులూ జరుగుతున్నాయి. రష్యా దాడులు మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ లోని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లపై సైబర్ దాడి జరిగింది. కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాంగ వ్యవహారాల శాఖ, మౌలిక వసతుల శాఖ, విద్యాశాఖ తదితర ప్రభుత్వ వెబ్ సైట్లపై దుండగులు సైబర్ దాడికి పాల్పడ్డారు.

ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటు సమాచారం మొత్తాన్ని తుడిచిపెట్టేసే డేటా వైపింగ్ టూల్ ‘వైపర్’ మాల్వేర్ ఉక్రెయిన్ లోని వందలాది కంప్యూటర్లలో ప్రత్యక్షమైంది. కాగా, నిన్న ఉక్రెయిన్ పార్లమెంట్, సెక్యూరిటీ సర్వీస్, కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ వెబ్ సైట్లలో తాత్కాలికంగా సమస్యలు వచ్చాయి. అది పోయిందనుకునేలోపే ఇవాళ ప్రభుత్వ వెబ్ సైట్లు, ప్రజల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయి.

వైపర్ మాల్వేర్ వల్ల ఉక్రెయిన్ కు చెందిన ఓ ఆర్థిక సంస్థ, రెండు ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన వెబ్ సైట్లు పూర్తిగా క్రాష్ అయ్యాయని బ్రాడ్ కామ్స్ సైబర్ సెక్యూరిటీ యూనిట్ సిమాంటెక్ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ ఠాకూర్ చెప్పారు. ఈ మాల్వేర్ వల్ల చాలా పెద్ద సంస్థలు ప్రభావితమయ్యాయని ఈసెట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ దాడులు ఎవరు చేశారన్నదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.

బుధవారం జరిగిన సైబర్ దాడులకు ఇవి కొనసాగింపు అని స్పెషల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్ వెల్లడించింది. ఈనెల 15న కూడా ఇలాంటి దాడులే జరిగాయి. ఈ దాడుల వెనుక రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ హస్తం ఉందని వైట్ హౌస్ అధికారులు ఆరోపించారు. అయితే, అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.

More Telugu News