Yogi Adityanath: రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుంది... షరియత్ చెప్పినట్టు కాదు: యోగి ఆదిత్యనాథ్

  • కర్ణాటకలో హిజాబ్ రగడ
  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
  • హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న ఒవైసీ
  • వ్యక్తిగత మతాచారాలను దేశ వ్యవస్థలపై రుద్దడం సరికాదన్న యోగి  
Yogi Adithyanath opines on hijab row

కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏదో ఒకనాడు హిజాబ్ ధరించిన మహిళే ప్రధాని అవుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందించారు. దేశంలో వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుందే తప్ప, షరియత్/ఇస్లామిక్ చట్టం ప్రకారం నడుచుకోదు అని స్పష్టం చేశారు.

ముస్లిం మహిళలకు ఊరట కలిగించేలా ప్రధాని ట్రిపుల్ తలాక్ నిబంధనను తొలగించారని యోగి వెల్లడించారు. వారికి దక్కాల్సిన హక్కులను, గౌరవాన్ని కల్పించేందుకు మోదీ ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వ్యక్తిగత మతాచారాలను, మతపరమైన నిర్ణయాలను దేశంపైనా, దేశ వ్యవస్థలపైనా రుద్దడం సరికాదని యోగి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని నేను ఆదేశించగలనా? అలాంటి డ్రెస్ కోడ్ నే పాటించాలని స్కూళ్లకు ఉత్తర్వులు ఇవ్వగలనా? అని ప్రశ్నించారు.

దేశం ఓ రాజ్యాంగం ప్రకారం నడిస్తే, అందుకు అనుగుణంగానే మహిళలు ఆత్మాభిమానం, భద్రత, స్వాతంత్ర్యం పొందుతారని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

More Telugu News