Telangana: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతాల విలీనం.. తెలంగాణ సర్కారు ప్రయత్నాలు

  • విలీనం చేసే ప్రాంతాలతో బ్లూప్రింట్ సిద్ధం
  • తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
  • తర్వాత ఢిల్లీ వెళ్లి రక్షణ శాఖతో చర్చలు
Telangana govt to approach defence ministry on cantonment areas merger issue

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పౌర ప్రాంతాల అభివృద్ధి కోసం వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కారు తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖతో చర్చలు జరిపేందుకు వీలుగా బ్లూప్రింట్ ను కూడా సిద్ధం చేసింది.

దీనిపై శాసనసభలో తీర్మానం అనంతరం, విలీనం అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలంగాణ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో తమ ప్రాంతాలను విలీనం చేసేందుకు స్థానిక పౌర సంక్షేమ సంఘాలు సైతం అనుకూలంగా ఉండడం గమనార్హం.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శాయన్న, అరవింద్ కుమార్, కంటోన్మెంట్ పరిధిలోని కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి, డాక్యుమెంట్ ను సమర్పించే ఆలోచనతో ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి రక్షణ శాఖ కార్యదర్శిని కలసి, కంటోన్మెంట్ పరిధిలో రోడ్ల మూసివేత, పౌర నివాస ప్రాంతాల విలీనం గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అరవింద్ కుమార్ తెలిపారు. గతంలో మాదిరిగా ఇక మీదట ప్రయత్నాలను పలుచన కానీయబోమని, ఈ విడత క్రమపద్ధతిలో ఒక దాని తర్వాత ఒక అడుగు వేస్తామని అరవింద్ కుమార్ చెప్పారు.

More Telugu News