FAPTO: మా వెనుక ఏ పార్టీ లేదు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన లేదు: ఉపాధ్యాయ సంఘాల నేతలు

  • పీఆర్సీ సాధన సమితి విడిపోయిన ఉపాధ్యాయ సంఘాలు
  • ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాలని డిమాండ్
  • ఈ అంశంలోనే విభేదాలు వచ్చాయని సుధీర్ బాబు వెల్లడి
FAPTO leaders says they are not going against govt

పీఆర్సీపై పోరాటంలో ఉద్యోగ సంఘాల నుంచి విడిపోయిన ఉపాధ్యాయ సంఘాల నేతలు నేడు మీడియాతో మాట్లాడారు. ఫిట్ మెంట్, గ్రాట్యుటీ అంశాల్లో తమకు అసంతృప్తి కలిగిందని, అందుకే మంత్రుల కమిటీతో విభేదించామని వారు చెప్పారు. ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ, తమ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము భావించడంలేదని స్పష్టం చేశారు.

సమస్యలను సీఎంకు నివేదిస్తామని మంత్రులకు చెప్పామని, అయితే అందుకు మంత్రులు చొరవ చూపలేదని ఆరోపించారు. సీఎంను కలిసే అవకాశమే లేదన్నారని, అందుకే మంత్రుల కమిటీతో సమావేశం నుంచి బయటికి వచ్చామని సుధీర్ బాబు వెల్లడించారు. ఒప్పందాలపై సంతకాలు చేయబోమని స్పష్టంగా చెప్పామని, తాము సంతకాలు చేసింది అటెండెన్స్ లో మాత్రమేనని తెలిపారు.

ఫిట్ మెంట్ 30 శాతం ఉండాలన్నది మొదటి నుంచి తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఈ అంశంలోనే తమకు విభేదాలు వచ్చాయని వివరించారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు పీఆర్సీ సాధన సమితి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదని పేర్కొన్నారు. శవయాత్రలు, పిండప్రదానాలు వంటి నిరసన ప్రదర్శనలు చేపట్టవద్దని స్పష్టం చేశారు.

More Telugu News