Asaduddin Owaisi: హిజాబ్ వివాదంపై స్పందించిన పాకిస్థాన్ మంత్రులు... మా సంగతి మేం చూసుకోగలమన్న ఒవైసీ

  • కర్ణాటకలో హిజాబ్ వివాదం
  • దారుణమంటూ వ్యాఖ్యానించిన పాక్ మంత్రులు
  • ముస్లింల అణచివేత జరుగుతోందని వ్యాఖ్యలు
  • హిజాబ్ అంశం మా సమస్య అంటూ ఒవైసీ స్పందన
Asaduddin Owaisi reacts to Pakistan ministers comments on Karnataka Hizab issue

కర్ణాటకలో రగులుతున్న హిజాబ్ వివాదం సెగలు పాకిస్థాన్ ను కూడా తాకాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఇది కాలరాయడమేనని మండిపడ్డారు. ముస్లిం బాలికల విద్యా హక్కును హరించి వేసే ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

హిజాబ్ ధరించే హక్కు లేదని చెప్పడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం కచ్చితంగా అణచివేత అని అన్నారు. భారత్ లోని ఈ రాష్ట్రం (కర్ణాటక) ముస్లింల పట్ల వెలివేత ధోరణి కనబరుస్తున్న వైనాన్ని ప్రపంచం గుర్తించాలని ఖురేషి పేర్కొన్నారు.

పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ సైతం కర్ణాటక వ్యవహారాన్ని తప్పుబట్టారు. అస్థిర నాయకత్వంలో భారతీయ సమాజం వేగంగా పతనావస్థలోకి జారుకుంటోందని వ్యాఖ్యానించారు. భారత్ లో ప్రస్తుతం పరిణామాలు భయానకంగా ఉన్నాయని హుస్సేన్ అభివర్ణించారు.

పాక్ మంత్రుల వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హిజాబ్ అంశం మా సమస్య... దీన్ని మేమే పరిష్కరించుకుంటాం అని స్పష్టం చేశారు. బాలికల విద్య అంశంపై మీరు మాకు పాఠాలు చెప్పనక్కర్లేదు అని ఒవైసీ హితవు పలికారు. మలాలా యూసఫ్ జాయ్ పై పాకిస్థాన్ లోనే దాడి జరిగిందని గుర్తు చేశారు.

మహిళలకు హిజాబ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. ఆ హక్కు పరిరక్షణ కోసమే పోరాటం జరుగుతోందని, హిజాబ్ కోసం పోరాడే వారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. హిజాబ్ కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఒవైసీ విమర్శించారు.

More Telugu News