PM Cares Fund: పీఎం కేర్స్ నిధికి కు ఎన్ని వేల కోట్లు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు?.. ఎన్డీటీవీ సంచలన కథనం.. రాహుల్ గాంధీ స్పందన!

  • 2021 నుంచి రూ. 10,990 కోట్ల విరాళాలు వచ్చాయి
  • ఇప్పటి వరకు 3,976 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
  • నిరుపయోగంగా ఉన్న రూ. 7,014 కోట్లు
NDTV special story on PM CARES Fund and reaction of Rahul Gandhi

పీఎం కేర్స్ నిధికి 2020 మార్చి 27 నుంచి 2021 మార్చ్ 31 వరకు రూ. 10,990 కోట్లు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అందులో 64 శాతం నిధులను ఖర్చు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం రూ. 3,976 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ఫండ్స్ మురిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఎన్డీటీవీ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది.

ఎన్డీటీవీ కథనంలో ఏముందంటే... కరోనాపై పోరాడేందుకు 2021 మార్చిలో పీఎం కేర్స్ ఫండ్ ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ కు భారీగా నిధులు వచ్చినప్పటికీ... వాటిని వినియోగించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఇప్పటి వరకు రూ. 7,014 కోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

అత్యవసర అవసరాలకు, బాధితులకు సహాయం చేసే లక్ష్యంతో ఈ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫండ్ కు 2020 ఆర్థిక సంవత్సరంలో 3,077 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 7,679 కోట్లు వచ్చాయి. 2020 ఏడాది ఫండ్ కు రూ. 235 కోట్ల వడ్డీ వచ్చింది. ఇదంతా కలిపి మొత్తం రూ. 1,991 కోట్లు అయింది. పీఎం కేర్స్ కు అందిన విరాళాల్లో రూ. 495 కోట్లు విదేశీ మార్గాల ద్వారా అందాయి.

కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో 2021 మార్చి నాటికి కేవలం రూ. 3,976 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నిధుల నుంచి 6.6 కోట్ల వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు రూ. 1,392 కోట్లను ఖర్చు చేశారు. రూ. 1,311 కోట్లను దేశీయంగా తయారైన 50 వేల వెంటిలేటర్లను కొనేందుకు వినియోగించారు. రూ. 201.58 కోట్లను 162 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉపయోగించారు. రూ. 20.41 కోట్లను ప్రభుత్వ లేబొరేటరీలను అప్ గ్రేడ్ చేసేందుకు వినియోగించారు. రూ. 50 కోట్లను పాట్నాలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు, దేశంలోని పలు రాష్ట్రాల్లో 16 ల్యాబులు (ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ టెస్టింగ్ కోసం) ఏర్పాటు చేసేందుకు ఉపయోగించారు.    

కొనుగోలు చేసిన వెంటిలేటర్లలో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. మెడికల్ స్టాఫ్ కు వీటిని ఉపయోగించేంత శిక్షణ లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఆసుపత్రుల్లో వాటిని ఆపరేట్ చేసే సిబ్బంది లేక అవన్నీ మూలకు పడున్నాయి. మరోవైపు ఈ నిధుల్లో వలస ప్రజల కోసం కేవలం రూ. 1,000 కోట్లను మాత్రమే కేటాయించారు. 2020 లాక్ డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది వలస కార్మికులు తమ కుటుంబాలతో వందలాది కిలోమీటర్లు నడుస్తూ వెళ్లిన సంగతి సెన్సేషన్ అయింది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి.

పీఎం కేర్స్ నిధిని ప్రకటించినప్పటి నుంచి దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచుతోంది. ఈ ఫండ్స్ పై అందరిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నిధులను వినియోగించడంలో పూర్తి పారదర్శకతను పాటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎక్కువ చర్చిస్తోంది. అన్ని వివరాలను బయట పెట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్డీటీవీ సంచలన కథనాన్ని ప్రచురించింది.

మరోవైపు ఎన్డీటీవీ కథనంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని అబద్దాలు చెపుతారని ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News