Asaduddin Owaisi: నాడు మహాత్మాగాంధీని చంపిన వారే ఇప్పుడు నాపై దాడిచేశారు: అసదుద్దీన్ ఒవైసీ

  • యూపీలో ఒవైసీ ఎన్నికల ప్రచారం
  • కాల్పుల ఘటనలో అరెస్ట్ అయిన ఇద్దరికీ బీజేపీ సంబంధాలున్నాయని వార్తలు
  • ఒక్క ఒవైసీని చంపితే లక్షల మంది ఒవైసీలు పుట్టుకొస్తారని హెచ్చరిక
  • పనిలో పనిగా అఖిలేశ్ యాదవ్‌పైనా తీవ్ర విమర్శలు
Killers of Mahatma Gandhi opened fire at me AIMIM chief Asaduddin Owaisi

నాడు మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఇప్పుడు తనపైనా దాడి చేశారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అసరా గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండడం, బీజేపీ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం చేస్తుండడంతోనే తనపై కాల్పులు జరిపారని అన్నారు. తనపై కాల్పులు జరిపిన వారే గాంధీ హత్య వెనక కూడా ఉన్నారని ఆరోపించారు.

ఒక్క ఒవైసీని చంపితే లక్షల మంది ఒవైసీలు పుట్టుకొస్తారని హెచ్చరించారు. చాప్రౌలీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ఎంఐఎం అభ్యర్థి అనీస్ అహ్మద్‌కు మద్దతుగా అసరా గ్రామంలో ప్రచారం చేస్తూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీపై కాల్పులు జరిపిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పనిలో పనిగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పైనా విరుచుకుపడ్డారు. ఎన్నికలు ముగిశాక అఖిలేశ్ తన హామీలను తుంగలో తొక్కుతారని విమర్శించారు. ‘‘అఖిలేశ్  మిమ్మల్ని మళ్లీ మోసం చేస్తారు జాగ్రత్త’ అని ప్రజలను హెచ్చరించారు. మైనారిటీలకు అఖిలేశ్ యాదవ్ ‘లాలీపాప్’ ఇస్తారని అన్నారు. రాజ్యసభ సభ్యులను చేస్తానని, ఎమ్మెల్సీలు చేస్తానని అంటారని, ఆ తర్వాత వారిని పట్టించుకోరని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

More Telugu News