Andhra Pradesh: అమిత్ షా  గారూ.. నన్ను కాపాడండి: ఢిల్లీలో వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ప్రదర్శన

  • తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ ప్రదర్శన
  • తనపై దాడిచేసిన వారిని, అందుకు పురికొల్పిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకోలు
YCP leder Subba Rao Gupta demand amit shah to action against attackers

తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కేంద్రమంత్రి అమిత్ షాను వేడుకున్నారు. ఈ మేరకు నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బ్యానర్ పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ఒంగోలులో తనపైనా, తన కుటుంబంపైనా దాడి జరిగిందని పేర్కొన్న ఆయన వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించడంతోపాటు తన ఇంటిపైనా, లాడ్జీలో తనపైనా దాడిచేసిన వారిని, అందుకు వారిని పురికొల్పిన వారిని కఠినంగా శిక్షించాలని సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు.

కాగా, డిసెంబరు 12న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందని, వారు తమ నోటిని అదుపులో ఉంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ నాయకులు, బాలినేని అనుచరులుగా చెబుతున్న వారు గుప్తా ఇంటిపై దాడిచేశారు. ఆ తర్వాత గుంటూరులో ఓ లాడ్జీలో ఉన్న గుప్తాపై దాడిచేసి క్షమాపణలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన బాలినేని అనుచరుడు సుభానిని అరెస్ట్ చేసి ఆపై బెయిలుపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గుప్తా ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News