Rahul Gandhi: రాహుల్ వ్యాఖ్యలకు చుక్కెదురు.. ఇంటా, బయటా వ్యతిరేకత

  • చైనా, పాక్ ను ఏకం చేశారు
  • మనం ఒంటరివాళ్లమయ్యాం
  • దేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్న రాహుల్ 
  •  తిప్పికొట్టిన విదేశాంగ మంత్రి జైశంకర్
  • సమర్థించడం లేదన్న అమెరికా
Rahul Gandhi Says You Brought Pak China Togethe Governments Counter

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఒంటరయ్యారు. భారత విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ కేంద్ర సర్కారుపై ఆయన చేసిన విమర్శలకు.. ప్రభుత్వం గట్టిగా బదులిచ్చింది. అటు అమెరికా సైతం రాహుల్ వ్యాఖ్యలను ఆమోదించడం లేదని ప్రకటించింది.

లోక్ సభలో బీజేపీ లక్ష్యంగా చేసుకుని రాహల్ విమర్శలు చేశారు. ‘‘భారత వ్యూహాత్మక లక్ష్యం.. చైనా, పాకిస్థాన్ ను వేరు చేయడమే. కానీ, మీరు ఆ రెండూ ఏకమయ్యేలా చేశారు. మనం ఎదుర్కొంటున్న ముప్పును తక్కువ అంచనా వేయరాదు. భారత్ కు ఇది తీవ్రమైన ముప్పు. రిపబ్లిక్ డే వేడుకకు విదేశీ అతిథులను ఎందుకు తీసుకురాలేకపోయామన్నది మీరు ప్రశ్నించుకోవాలి. మనం ఒంటరివాళ్లమయ్యాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దీనికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ట్విట్టర్ పై దీటుగా బదులిచ్చారు. బీజేపీ అధికారంలో లేని సమయంలో చైనా, పాకిస్థాన్ కలసి పనిచేసినట్టు గుర్తు చేశారు. ఇందుకు కొన్ని నిదర్శనాలను కూడా ఆయన పేర్కొన్నారు.

‘‘1963లో పాకిస్థాన్ అక్రమంగా షాక్స్ గామ్ వ్యాలీని చైనాకు అప్పగించింది. 1970ల్లో పాకిస్థాన్ లో కారాకోరమ్ హైవేని చైనా నిర్మించింది. 1970ల నుంచే చైనా, పాక్ అణు సహకారంపై కలసి పనిచేశాయి. 2013లో చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ మొదలైంది’’ అని జైశంకర్ చరిత్రను గుర్తు చేశారు.

రాహుల్ వ్యాఖ్యలను అమెరికా సమర్థించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు రాహుల్ వ్యాఖ్యలను ఆయన ముందు ప్రస్తావించారు. ‘‘పాకిస్థాన్, పీఆర్సీ (చైనా) తమ అనుబంధంపై స్పందించాలి. రాహుల్ వ్యాఖ్యలను సమర్థించడం లేదు’’ అని పేర్కొన్నారు. అమెరికా, చైనాల్లో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం దేశాలకు లేదన్నారు. అమెరికాతో భాగస్వామ్యంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గుర్తు చేశారు. అమెరికాకు పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నారు.

More Telugu News