PRC: నేటి ‘చలో విజయవాడ’పై పోలీసుల ఉక్కుపాదం.. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు

  • పీఆర్సీకి వ్యతిరేకంగా నేడు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు
  • రైళ్లు, బస్సుల్లో వెళ్తున్న వారిని తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు
  • వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరిక
House arrests in ap amid chalo vijayawada

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. విజయవాడకు దారితీసే అన్ని మార్గాలను దిగ్బంధించారు. కొందరు ముఖ్య నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులను గృహ నిర్బంధం చేశారు.

రైళ్లు, బస్సులు, వాహనాల్లో వెళ్తున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుమానం వస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు, ‘చలో విజయవాడ’కు అనుమతి లేదని, కాదని వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చింది. అత్యవసర వైద్య కారణాలైతే తప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గురువారం సెలవులు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అలాగే, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఖజానా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందకుమార్‌ను నిర్బంధించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు.

More Telugu News