Vijay Sai Reddy: కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన

  • వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీయే సర్కారు
  • పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
  • పన్నుల వాటాలో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనన్న విజయసాయి
Vijaysai Reddy comments on union budget

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నేడు వార్షిక బడ్జెట్ (రూ.39.45 లక్షల కోట్లు) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందని అన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు.

ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని నిర్మలా సీతారామన్ చెప్పారని విజయసాయి పేర్కొన్నారు. 2021లో ఏపీ ఆర్థిక లోటు 5.38 శాతం అని వెల్లడించారు. 2022లో ఏపీ ఆర్థిక లోటు 3.49 శాతం అని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఎఫ్ఆర్ బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటేనని విజయసాయి స్పష్టం చేశారు. తాను ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటరాదంటోందని విమర్శించారు. ఎఫ్ఆర్ బీఎంపై కేంద్రానివి ద్వంద్వ ప్రమాణాలు అని పేర్కొన్నారు.

కాగా, రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధాన ప్రణాళికను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజయసాయి విజ్ఞప్తి చేశారు.

భూమి లేని రైతులకు ఆసరాగా నిలిచే పథకం తీసుకురావాలని కోరామని, కనీస మద్దతు ధరకు న్యాయపరమైన రక్షణ ఉండాలని తెలిపామని విజయసాయి వివరించారు. అయితే, అన్ని విధాలా పరిశీలిస్తే ఇది నిరుత్సాహపరిచే బడ్జెట్ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News