Tamil Nadu: తన 8 మంది పిల్లలను పోషిస్తామన్న అధికారుల హామీతో టీకా వేయించుకున్న వ్యక్తి!

  • తమిళనాడులోని తిరుపత్తూరులో ఘటన
  • ప్రభుత్వం నుంచి తాను ఏమీ పొందలేకపోయానని ఆవేదన
  • టీకా వేయించుకున్నాక తనకేమైనా అయితే పిల్లలు అనాథలైపోతారన్న వృద్ధుడు
  • డిమాండ్లు పరిష్కరిస్తామన్న సర్పంచ్ హామీతో టీకా
Man vaccinated after officials agree to fulfill his demands

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 150 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ప్రస్తుతం బూస్టర్ డోసు కూడా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ టీకాపై ఇప్పటికీ ప్రజల్లో అపోహలు ఉన్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం.

టీకా వేసుకోనంటే వేసుకోనని భీష్మించుకున్న ఓ వృద్ధుడు.. టీకా వేసుకున్నాక తనకేదైనా జరిగితే తన 8 మంది పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందాడు. అధికారులు ఎంత బతిమాలినా టీకా వేసుకునేదే లేదని తేల్చి చెప్పాడు. తమిళనాడు తిరుపత్తూరులోని పురికమనిమిట్టలో జరిగిందీ ఘటన.

గ్రామంలో మొత్తం 1159 మంది టీకా లబ్ధిదారులు ఉండగా వారిలో 1158 మంది టీకా వేయించుకున్నారు. కుడియన్ అనే వృద్ధుడు మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించాడు. ప్రభుత్వం తనకు ఇల్లు ఇవ్వలేదని, కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రభుత్వం నుంచి పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తానెందుకు టీకా వేయించుకోవాలని ప్రశ్నించాడు. తనకు డయాబెటిస్ కూడా ఉందని, టీకా వేయించుకున్నాక జరగరానిది ఏదైనా జరిగితే తన 8 మంది పిల్లలు అనాథలైపోతారని, వారిని ఎవరు పోషిస్తారని ప్రశ్నించాడు.

దీంతో కదిలొచ్చిన స్థానిక సర్పంచ్ టీకా వేయించుకోవాలని నచ్చజెప్పారు. కుడియన్ డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏదైనా జరిగితే ఆయన 8 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇవ్వడంతో కుడియన్ టీకా వేయించుకున్నాడు.

More Telugu News