GV Anjaneyulu: రాష్ట్ర రాజధానికి ఒక న్యాయం.. జిల్లా కేంద్రాలకు మరో న్యాయమా?: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

  • కొత్త జిల్లాల కేంద్రాలు సమ దూరంలో ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది
  • అమరావతి కూడా అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉంది
  • మీరు రాజధాని చేయాలనుకుంటున్న విశాఖ అన్ని ప్రాంతాలకు దూరంగా ఉంది
YSRCP is practicing diversion politics says GV Anjaneyulu

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ఒక న్యాయం, జిల్లాల కేంద్రాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికి రాదంటున్న ప్రభుత్వం... జిల్లా కేంద్రాలు సమాన దూరంలో ఉన్నాయనే వాదనను ఎలా తీసుకొస్తుందని అడిగారు.

రాజధానిగా చేయాలనుకుంటున్న విశాఖ అన్ని ప్రాంతాలకు దూరంగా ఉందని, అలాంటి విశాఖను రాజధానిగా చేస్తామని చెపుతున్న వైసీపీ నేతలు... జిల్లా కేంద్రాల విషయంలో ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. శాస్త్రీయ పద్ధతిని పాటించకుండా జిల్లాలను విభజించారని ఆంజనేయులు విమర్శించారు.

గుడివాడ కేసినో విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కేసినో వివాదం, ఉద్యోగుల సమస్యల అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చి, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ కు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. జనగణన పూర్తయ్యేంత వరకు కొత్త జిల్లాల ఏర్పాటు వద్దని కేంద్రం చెప్పినా ఇష్టానుసారం జిల్లాలను విభజించారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్... కొత్త జిల్లాల అభివృద్ధికి నిధులను ఎలా సమకూర్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News