Ravi Shastri: బుమ్రాకి కెప్టెన్సీనా... నాకెప్పుడూ ఆ ఆలోచనే రాలేదు: రవిశాస్త్రి

  • టీమిండియా టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా
  • కెప్టెన్సీ అంశంపై చర్చ
  • తెరపైకి రోహిత్, రాహుల్, బుమ్రాల పేర్లు
  • సుదీర్ఘకాలం జట్టులో ఉండేవాడు కెప్టెన్ అవ్వాలన్న శాస్త్రి
Ravi Shastri opines on Team India test captaincy

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్టు కెప్టెన్సీ అంశంపై స్పందించారు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగిన నేపథ్యంలో, తదుపరి కెప్టెన్ అంటూ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లతో పాటు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ, బుమ్రాకు కెప్టెన్సీ అనే అంశంపై తానెప్పుడూ ఆలోచించలేదని అన్నారు.

ఫాస్ట్ బౌలర్లు జట్టులో సుదీర్ఘకాలం కొనసాగడం కష్టమని, అలాంటప్పుడు కెప్టెన్ గా ఓ పేసర్ ను నియమించడం సరికాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఒకవేళ బౌలర్ కు కెప్టెన్సీ ఇవ్వాలంటే బాబ్ విల్లిస్ (ఇంగ్లండ్ మాజీ పేసర్) లాగా ఎప్పుడూ జట్టులో ఉండే ఆటగాడు అయ్యుండాలని పేర్కొన్నారు. ఓ పేసర్ కెప్టెన్ బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించగలిగినప్పుడే అతడు కెప్టెన్సీ గురించి ఆలోచించాలని అన్నారు. అలాంటి ఆటగాళ్లు భారత్ లో తక్కువని, ఓ కపిల్ దేవ్, ఓ గారిఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్ దిగ్గజం)లాంటి ఆటగాళ్లు అయితే టీమిండియాకు సారథిగా సరిపోతారని వివరించారు.

ఇటీవల కోహ్లీ టీ20 నాయకత్వం వదులుకోగా, సెలెక్టర్లు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఈ రెండు ఫార్మాట్లలో కెప్టెన్సీ అప్పగించారు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా రోహిత్ శర్మకే అందిస్తారని భావిస్తున్నారు.

అయితే, ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్ లో బుమ్రా టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. జట్టును నడిపించే అవకాశం వస్తే వెనుకంజవేయబోనని బుమ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడంతో టెస్టుల్లో టీమిండియా కెప్టెన్సీ అంశంపై చర్చ మొదలైంది.

More Telugu News