Chandrababu: ఎన్టీఆర్ పై ప్రేమ ఉందని చెప్పే జగన్ నిర్ణయాలను ప్రజలు నమ్మరు: 'ఎన్టీఆర్ జిల్లా' ఏర్పాటుపై చంద్రబాబు స్పందన

  • ఏపీలో కొత్త జిల్లాలు
  • విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా
  • అందుకు తామేమీ వ్యతిరేకం కాదన్న చంద్రబాబు
  • టీడీపీకి ద్వంద్వ విధానాలు లేవని స్పష్టీకరణ
  • జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ స్మృతివనం నిలిపివేసిందని ఆరోపణ
Chandrababu reacts on NTR District

ఏపీ ప్రభుత్వం 26 జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలను తెరపైకి తీసుకురావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలు, ఉద్యోగుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

జనాభా లెక్కల గణన పూర్తయ్యేంతవరకు జిల్లాల విభజన చేపట్టకూడదంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాల విభజన చేపడుతున్నారని వివరించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకే జిల్లాల విభజన ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదని హితవు పలికారు.

అంతేకాదు, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడంపైనా చంద్రబాబు తన అభిప్రాయాలను వెల్లడించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని అన్నారు. ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని వ్యాఖ్యానించారు.

హైదరాబాదులో ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరును వైఎస్సార్ తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. కడప జిల్లాకు వైఎస్ పేరుపెడితే తామేమీ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండవని ఉద్ఘాటించారు. అయితే, ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్టును నిలిపివేసిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. అన్నా క్యాంటీన్ లను జగన్ నిలిపివేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

కొత్త జిల్లాల నిర్ణయంపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తోందని విమర్శించారు. తొందరపాటు నిర్ణయాలతో ఏపీకి ఇప్పటికే జగన్ తీవ్ర నష్టం కలిగించారని, అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం క్యాబినెట్ లో కూడా సమగ్రంగా చర్చించకుండా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఇవ్వాల్సినంత అవసరం ఏమిటి? అని నిలదీశారు. రాజధానుల తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News