RRB: బీహార్‌లో ఆర్ఆర్‌బీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకం.. రైలు దహనం

  • అభ్యర్థుల ఎంపికకు మరో పరీక్ష నిర్వహిస్తామన్న ఆర్ఆర్‌బీ
  • ఆగ్రహంతో రోడ్డెక్కిన అభ్యర్థులు
  • ఉత్తరప్రదేశ్‌లోనూ హింసాత్మకం
  • గయలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు
  • పలు రైళ్లు రద్దు
Train Set On Fire In Bihar Over Railways Exam

బీహార్‌లో ఆర్ఆర్‌బీ ఉద్యోగుల ఆందోళన హింసకు దారితీసింది. పలు రైళ్లపై రాళ్లదాడికి దిగిన అభ్యర్థులు.. ఓ రైలును దహనం చేశారు. ఎన్‌టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పరీక్ష-2021కి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) 2019లో నోటిఫికేషన్ విడుదల చేసింది. లెవల్-2 నుంచి లెవల్-6 వరకు మొత్తం 35 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పరీక్ష ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. అయితే, అభ్యర్థుల ఎంపికకు మరో పరీక్ష నిర్వహిస్తామని రైల్వే శాఖ ప్రకటించడం అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది.

నోటిఫికేషన్‌లో ఒకటే పరీక్ష అని చెప్పి ఇప్పుడు రెండు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గయలో భభువా-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. మరికొన్ని రైళ్లపై రాళ్లదాడికి దిగారు.  జెహనాబాద్‌లో మోదీ దిష్టిబొమ్మను రైలు పట్టాలపై దహనం చేశారు. సీతామర్హిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే, సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అభ్యర్థులు మూడు వారాల్లోగా తమ సలహాలు, సందేహాలను ఈ కమిటీకి తెలియజేయాలని కోరింది.

రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని జీవితాంతం రైల్వే ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించింది. కాగా, అభ్యర్థుల ఎంపికకు తాము రెండు పరీక్షలు నిర్వహిస్తామనే చెప్పామని రైల్వే శాఖ చెబుతోంది. ఫిబ్రవరి 23 నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు ప్రకటించింది.

More Telugu News