Shivangi Singh: వైమానిక దళ శకటానికి 'రాఫెల్ తొలి మహిళా పైలెట్' శివాంగి ప్రాతినిధ్యం

  • రిపబ్లిక్ డే పరేడ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన శివాంగి సింగ్
  • రాఫెల్, స్వదేశీ యుద్ధ హెలికాప్టర్ నమూనాలతో శకటం
  • మొత్తంగా శకట ప్రదర్శనలో రెండో మహిళా పైలట్ గా ఖ్యాతి
Rafael First Woman Pilot Shivangi Singh Represents IAF Tableau

రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్ గా గుర్తింపు తెచ్చుకున్న శివాంగి సింగ్.. ఇవాళ గణతంత్ర వేడుకల్లో అందర్నీ ఆకట్టుకున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించిన పరేడ్ లో భారత వైమానిక దళ శకటానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ అయిన ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ శకటానికి స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ స్వామినాథన్ నేతృత్వం వహించారు.

శకట ప్రదర్శనలో భాగంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 8 అడ్డు వరుసలు, 12 నిలువు వరుసల్లో పరేడ్ చేశారు. శకటంపై రాఫెల్ యుద్ధ విమానం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్, త్రీడీ సర్వీలెన్స్ రాడార్ ఆశ్లేష ఎంకే 1ల నమూనాలను ఏర్పాటు చేశారు.

అలాగే, పాకిస్థాన్ తో 1971 యుద్ధంలో కీలక భూమిక పోషించిన మిగ్ 21 యుద్ధ విమానాన్నీ ప్రదర్శించారు. కాగా, శివాంగికి ముందు రిపబ్లిక్ డేలో ఎయిర్ ఫోర్స్ శకటానికి భావనా కాంత్ ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఎయిర్ ఫోర్స్ శకటానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలిచారు.

రాఫెల్ కు పైలెట్ గా ఎంపికవడానికి ముందు ఆమె మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. వారణాసికి చెందిన ఆమె.. పంజాబ్ లోని అంబాలాలో ఉన్న వైమానిక దళ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ లో సభ్యురాలు. 2020లో ఆమె తొలిసారి రాఫెల్ ను నడిపారు. ఎంతో కఠోరమైన శిక్షణ తర్వాత శివాంగిని రాఫెల్ పైలెట్ గా ఎంపిక చేశారు.

More Telugu News